కర్ణాటక సంకీర్ణంలో కుదుపు

5 Mar, 2019 03:21 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి కుదుపునిస్తూ కాంగ్రెస్‌ అసమ్మతి ఎమ్మెల్యే ఉమేశ్‌ జి.జాదవ్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. సోమవారం విధానసభ సభాపతి రమేశ్‌ నివాసానికి వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. కలబుర్గి జిల్లా చించోళి అసెంబ్లీ నుంచి ఎన్నికైన జాదవ్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన కలబుర్గిలో ప్రధాని మోదీ పాల్గొనే సభలో ఉమేశ్‌ జాదవ్‌ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది. జాదవ్‌కు బీజేపీ తరఫున కలబుర్గి ఎంపీ సీటు ఖరారైనట్లు కూడా సమాచారం.

ఇక్కడ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఎంపీగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి ప్రియాంక్‌ ఖర్గే నియంతృత్వ పోకడలతో జాదవ్‌ పార్టీని వీడుతున్నారని సమాచారం. జాదవ్‌తోపాటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రమేశ్‌ జర్కిహోలి, బి.నాగేంద్ర, మహేశ్‌ కుమతలి కూడా బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ నలుగురూ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరు కావడంతో అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్‌ నేతలు గత నెలలో స్పీకర్‌ను కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణానికి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, తిరుగుబాటు చేసినా ప్రమాదం పొంచి ఉంది. జాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచారని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు ఆరోపించారు.

మరిన్ని వార్తలు