రిసార్టు నుంచి ఇళ్లకు...

22 Jan, 2019 04:30 IST|Sakshi

పార్టీ ఎమ్మెల్యేలను పంపించేసిన కర్ణాటక కాంగ్రెస్‌

శివాజీనగర (బెంగళూరు): కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రిసార్టు బస ముగిసింది. అయితే, క్యాంపులో ఉండగా తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గణేశ్‌ సస్పెన్షన్‌కు గురికాగా, అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రలోభాల భయంతో కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజులుగా బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్‌ రిసార్టులో 70 మందికిపైగా తమ ఎమ్మెల్యేలను ఉంచిన విషయం తెలిసిందే. వీరందరినీ సోమవారం ఇళ్లకు పంపించి వేసింది. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి కన్నుమూయడం, ఇద్దరు ఎమ్యెల్యేల ఘర్షణ వివాదాస్పదం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. సోమవారం సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి, బీజేపీ ప్రలోభాలకు లొంగరాదని హితబోధ చేసినట్లు సమాచారం.

రిసార్టులో ఉండగానే హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌ కొట్టుకున్న ఘటన వివాదాస్పదమైంది. ఆనంద్‌సింగ్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గణేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆనంద్‌ సింగ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు గట్టిగా పట్టుబట్టారు. గత్యంతరం లేక వారు ఫిర్యాదు చేసేందుకు అంగీకరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేయలేదని గణేశ్‌ తనపై కోపంతో ఉన్నాడనీ, అలాగే, తన బంధువు ఒకరు గణేశ్‌ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించిన విషయం ప్రస్తావనకు వచ్చి గొడవ మొదలైందని ఆనంద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు