కన్నడ సంక్షోభం: నేడు స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!

9 Jul, 2019 11:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేల రాజీనామా అంశాన్ని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించనున్నారు. ఆయన నేడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

స్పీకర్‌ ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఇక, స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించకుండా.. దాటవేత ధోరణి అవలంబిస్తే.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి కొంత సమయం దొరికినట్టు అవుతోంది. అలా కాకుండా రాజీనామాలు ఆమోదించినా.. లేదా అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించినా సంకీర్ణకూటమికి గడ్డుకాలమే. అయితే, వ్యక్తిగతంగా తనను కలువాల్సిందిగా స్పీకర్‌ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను ఆదేశించి అవకాశముందని వినిపిస్తోంది.

మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించి తమవైపు రప్పించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్  ముంబై వెళ్లారు. ముంబైలో మకాం వేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక, రెబెల్‌ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నా.. మరోవైపు ఎమ్మెల్యేలు జారిపోతూనే ఉన్నారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు  గుడ్‌బై చెప్పారు. దీంతో కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిందని, వెంటనే కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కుమారస్వామి రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ..  సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగింది.
(చదవండి: మంత్రులంతా రాజీనామా)

మరిన్ని వార్తలు