కాంగ్రెస్‌లోనే ఉంటా: రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌

13 Jul, 2019 12:29 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్నాటకలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధం కావడంతో... రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ చర్చలు ఫలించాయి. రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌ తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా శివకుమార్‌ శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరతో కలిసి నాగరాజ్‌ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని వీరు నాగరాజ్‌ను కోరారు. అనంతరం శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... నాగరాజ్‌ కాంగ్రెస్‌లో ఉంటానని తమకు మాటిచ్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో తమకు 40ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి కుటుంబంలో కష్టనష్టాలు ఉంటాయని శివకుమార్‌ వ్యాఖ్యానించారు. నాగరాజ్‌  కాంగ్రెస్‌కి వీధేయుడని... పార్టీలోనే కొనసాగుతారని డీకే శివకుమార్‌ తెలిపారు. ఆయన తిరిగిరావడంతో తమకు కొండంతబలం వచ్చినట్టుందన్నారు. మరో రెబల్ ఎమ్మెల్యే సుధాకర్‌తో చర్చించి ఇద్దరూ కలిసి వస్తామని నాగరాజ్‌  హామీ ఇచ్చారు. 

చదవండిరెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు 

మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గంతోనూ శివకుమార్‌ టచ్‌లో ఉన్నారు. వారంతా బెంగళూరు రావాలని ఆయన ఆహ్వానించారు. తనతో ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చచెప్పే ప్రయత్నం కాగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి కాంగ్రెస్‌ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసమ్మతిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను సమావేశాలకు తీసుకురావడానికి డీకే బ్రదర్స్‌ శివకుమార్‌, సురేశ్‌ రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, శివాజీనగర ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌, ఆనంద్‌ సింగ్‌, మునిరత్నలను ఒప్పించి సభకు తీసుకు రావడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డీకే బ్రదర్స్‌ తమవంతు ప్రయత్నాలు చేపట్టారు. ఇప్పటికే అసమ్మతితో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడారు. అయితే వారు తమ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయినా కూడా ఏదో రకంగా వారిని ఒప్పించి తీసుకు వస్తామని సీఎంకు డీకే బ్రదర్స్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు