కర్ణాటకలో 70 శాతం పోలింగ్‌

13 May, 2018 03:05 IST|Sakshi
హుబ్బళిలో ఓటు హక్కు వినియోగించుకున్న కొత్త జంటలు

222 అసెంబ్లీ స్థానాల్లో

ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్‌

2013 అసెంబ్లీ ఎన్నికల్లో 71.4 శాతం పోలింగ్‌ 

హోరాహోరీ తలపడ్డ కాంగ్రెస్, బీజేపీ.. గట్టిపోటీనిచ్చిన జేడీఎస్‌

బెంగళూరు/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దాదాపు 5 కోట్ల మంది ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలు దాటినా చాలామంది ఓటర్లు క్యూలైన్లలో వేచివున్న నేపథ్యంలో ఓటింగ్‌ శాతం మరింత పెరగవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 71.4 శాతం పోలింగ్‌ నమోదైంది. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 222 చోట్ల పోలింగ్‌ జరగ్గా.. బీజేపీ అభ్యర్థి మృతితో జయనగర స్థానంలో, భారీగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయటపడటంతో ఆర్‌ఆర్‌ నగర్‌ స్థానంలో ఓటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోటీపడగా.. అనేక స్థానాల్లో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ గట్టి పోటీనిచ్చింది.  

2,600 మంది అభ్యర్థులు  
ఈ ఎన్నికల్లో మొత్తం 2,600 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోగా.. కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, మాజీ సీఎంలు బీఎస్‌ యడ్యూరప్ప, జగదీష్‌ షెట్టార్‌లు బీజేపీ తరఫున, హెచ్‌డీ కుమార స్వామి జేడీఎస్‌ నుంచి ఎన్నికల బరిలో తలపడ్డారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఈసీ అధికారులు పేర్కొన్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల్లో లోపాలు తలెత్తగా.. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకు న్నాయి. ‘సాయంత్రం 6 గంటల వరకూ మొత్తం 70 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలు మినహా అన్ని చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది’ అని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్‌
పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు అత్యధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకూ కొంత మందకొడిగా సాగిన ఓటింగ్‌ ఆ తర్వాత ఊపందుకుంది. ఉదయాన్నే ఓటు వేసిన వారిలో ప్రముఖ క్రికెటర్లు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే, సినీ నటులు రమేశ్‌ అరవింద్, రవిచంద్రన్, మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ కృష్ణదత్త వడియార్‌లు ఉన్నారు.

మరిన్ని వార్తలు