ఎం3 ఈవీఎంలు.. పింక్‌ బూత్‌లు

13 May, 2018 04:03 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈసారి కొన్ని ప్రయోగాలకు వేదికగా నిలిచాయి. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ‘పింక్‌ బూత్‌’లు ఏర్పాటు చేయడంతో పాటు.. అత్యాధునిక మూడో తరం ఈవీఎంలను కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం వినియోగించింది. కర్ణాటకలో 75 శాతం ఓటింగ్‌ నమోదు లక్ష్యంగా ఈ చర్యలకు ఈసీ అధికారులు శ్రీకారం చుట్టారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ట్యాంపరింగ్‌ చేసేందుకు వీలులేని ‘ఎం3 ఈవీఎం’ల్ని బెంగళూరు నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించారు.

ఎవరైనా ట్యాంపర్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ సరికొత్త ఈవీఎంలు వాటంతటవే పనిచేయడం మానేస్తాయని ఈసీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని శివాజీ నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, రాజాజీ నగర్‌ నియోకవర్గాల్లో వీటి పనితీరును పరీక్షించారు. ఏవైనా లోపాలుంటే హెచ్చరించేలా ‘ఎం3’ ఈవీఎంల్లో ఏర్పాట్లు చేశారు.  ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేలా సఖి పేరుతో 450 పింక్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా మొత్తం మహిళా అధికారులే ఈ బూత్‌లను నిర్వహించడం విశేషం.

మరిన్ని వార్తలు