మళ్లీ ‘రిసార్టు’ రాజకీయాలు? 

16 May, 2018 02:02 IST|Sakshi
కుమార స్వామి, యడ్యూరప్ప (ఫైల్‌ ఫోటో)

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మరోసారి రిసార్టు రాజకీయాలకు తెరలేచే అవకాశం కన్పిస్తోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజార్టీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే జేడీఎస్‌ను చీల్చితేనే సాధ్యమవుతుంది. ఆ పరిస్థితి ఏర్పడితే మాత్రం తన ఎమ్మెల్యేల్ని జేడీఎస్‌ ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ కూడా తన ఎమ్మెల్యేలు చేజారకుండా అప్రమత్తం కావచ్చు.

నిజానికి ఈ తరహా రిసార్టు రాజకీయాలు కర్ణాటకకు కొత్తేమీ కాదు. 2004లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినప్పుడు.. బీజేపీకి 90, కాంగ్రెస్‌కు 65, జేడీఎస్‌కు 58 స్థానాలు వచ్చాయి. దీంతో తమ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు చీల్చకుండా జేడీఎస్‌ ముందుగానే అప్రమత్తమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్ని బెంగళూరు శివారులోని రిసార్ట్‌కు తరలించి కొన్ని రోజులు అక్కడే ఉంచారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరాకే.. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించి బీజేపీతో వెళ్లాలని 2006లో హెచ్‌డీ కుమారస్వామి నిర్ణయంతో మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేచాయి.

బీజేపీ–జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పడేవరకూ తన ఎమ్మెల్యేల్ని జేడీఎస్‌ గోవాలోని రిసార్టులో దాచిపెట్టింది. ఇక 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 110 స్థానాలు దక్కినా.. మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 80 చోట్ల విజయం సాధించింది. ఆ సమయంలో గాలి జనార్దన్‌ రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర అభ్యర్థుల్ని రిసార్టులకు తరలించారు. అనంతరం పలువురు కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేల్ని కూడా రిసార్టుల్లో ఉంచి రాజకీయం కొనసాగించారు.

>
మరిన్ని వార్తలు