కర్ణాటక: ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే

18 May, 2018 16:28 IST|Sakshi
ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్‌

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా నిర్ణయంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం సీనియర్‌ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్‌వీ దేశ్‌పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమిస్తూ గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్‌పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు.

నియమ నిబంధనల ప్రకారమే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు