జ్యోతిష్కుడు చెప్పాడని...

5 Jul, 2018 14:27 IST|Sakshi

మూఢ‌న‌మ్మ‌కాల జాడ్యం గురించి ప్రజల్లో అవగాహన కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. ప్రజాప్రతినిధి, స్వయానా సీఎం సోదరుడు వాటిని ఆచరించటం చర్చనీయాంశమే. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోదరుడు, మంత్రి హెచ్‌డీ రేవణ్ణ దురదృష్టాన్ని దూరం చేసుకునేందుకు రోజూ 340 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ప్రతీరోజూ నియోజకవర్గం(హోలెనరసిపుర), రాజధాని బెంగళూరు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వార్తల్లో నిలిచారు. 

సాక్షి, బెంగళూరు: నిజానికి బెంగళూరులోని బనశంకరి ఫేజ్‌-2లో ఆయనకు లంకంత కొంప ఉంది. అంతేకాదు దేవగౌడ కుటుంబానికి సంబంధించిన నగరంలో, ఆ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇళ్లులు ఉన్నాయి. అయినా వాటిలో ఉండేందుకు ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరు. అందుకు కారణం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటే. మంత్రిగా ఉన్ననాళ్లు నగరంలోని సొంత ఇంట్లో నిద్రిస్తే దురదృష్టం వెంటాడుతుందని చెప్పాడంట. అంతేకాదు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించటంతో అప్పటి నుంచి ఆయన రాత్రిపూట నగరంలో ఉండేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తే అందులో హాయిగా ఉండొచ్చని జ్యోతిష్యుడు సూచించాడు. దీంతో బంగ్లా కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. 

మంత్రిగా ప్రమాణ స్వీకారణం చేశాక రేవణ్ణకు ఇంత వరకు బంగ్లా కేటాయింపు జరగలేదు. కుమార పార్క్‌ వెస్ట్‌లోని బంగ్లాలో మాజీ మంత్రి హెచ్‌ సీ మహదేవప్ప ఉన్నారు. ఖాళీ చేసేందుకు మూడు నెలల గడువు కోరటంతో చేసేది లేఖ రేవణ్ణ అప్‌ అండ్‌ డౌన్‌ జర్నీలతో గడుపుతున్నారు.  ఈ వ్యవహారంపై రేవణ్ణ స్పందిస్తూ... ‘నాకు ఇంతదాకా బంగ్లా కేటాయించలేదు. అందుకే ఇలా తిరగాల్సి వస్తుంది’ అని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు- హోలెనరసిపుర మధ్య దూరం 170 కిలోమీటర్లు, మూడు గంటలకు పైగానే జర్నీ. కాన్వాయ్‌లోని వాహనాలు, సిబ్బంది ఖర్చులు, ఇలా మొత్తం అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ వ్యవహారంపై జేడీఎస్‌ నేత ఒకరు స్పందిస్తూ.. ‘ఎవరి నమ్మకాలు వారివి’ అని తెలిపారు. పలువురు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

కుమారస్వామికి కలిసొచ్చిన ఇల్లు...

మరిన్ని వార్తలు