పార్టీ మారకుండా ఎందుకు రాజీనామా !?

12 Jul, 2019 18:49 IST|Sakshi
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి

సాక్షి, న్యూఢిల్లీ : అటో ఇటో తొందర్లోనే తేలిపోతుందనుకున్న కర్ణాటక సంక్షోభం అనూహ్యంగా ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో యథాతధా స్థితిని కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తాను సభా విశ్వాసానికి సిద్ధమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించడం విశేషమే. అప్పటి వరకు సందిగ్ధత కొనసాగక తప్పదు. బీజేపీ ప్రలోభాల వల్లనే 14 మంది శాసన సభ్యులు రాజీనామా చేశారంటూ కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

రెబల్స్‌ బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయినట్లయితే రాజీనామా చేయడానికి బదులు అవిశ్వాసం తీర్మానం సందర్భంగా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చుగదా? అన్న సందేహం కలుగుతుంది. పార్టీ విప్‌లను ఉల్లంఘించినందుకు బర్తరఫ్‌తో అసెంబ్లీ సభ్వత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయమా? రాజీనామా చేసినా సభ్యత్వం ఎలాగు పోతుందికదా! అవినీతి కేసుల కారణంగా కాకుండా పార్టీల ఫిరాయింపుల కింద అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అలాంటి సమయాల్లో తదుపరి జరిగి ఉప ఎన్నికల్లో మరో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి గెలవచ్చు. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా రాజీనామానే ఎందుకు చేశారు?

14 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడం వల్ల శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 210కి, పాలకపక్షం సభ్యుల సంఖ్య 104కు పడిపోతుంది. 105గా ఉన్న బీజేపీ బలం స్వతంత్ర అభ్యర్థి, మరో పార్టీ ఏకైక అభ్యర్థి మద్దతులో 106కు చేరుకుంటుంది. అంటే మెజారిటీ సభ్యుల బలం బీజేపీకి ఉంటుంది. అదే అవిశ్వాసానికి వెళ్లినట్లయితే 14 మంది బీజేపీకే వేస్తారన్న నమ్మకం బీజేపీకి లేదు. అందులో ముగ్గురు, నలుగురు సభ్యులు పాలకపక్షం వెంట ఉన్నా ఆ ప్రభుత్వం పడిపోవడం కష్టం. పైగా కుమారస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని అనుమతిస్తారా, లేదా? అన్నది కూడా అనుమానమే కనుక రెబల్స్‌కు బీజేపీ రాజీనామాల దారినే చూపింది. ఇప్పుడు కుమారస్వామియే అవిశ్వాసానికి సిద్ధమవడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది.

మరిన్ని వార్తలు