మంత్రులంతా రాజీనామా

9 Jul, 2019 03:42 IST|Sakshi
బెంగళూరులో హోటల్‌ నుంచి వెళ్లిపోతున్న జేడీఎస్‌ ఎమ్మెల్యేలు

అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పదవీ త్యాగం

కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వం చివరి అస్త్రం

21 మంది కాంగ్రెస్, 9 మంది జేడీఎస్‌ మంత్రుల రాజీనామా

వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ

రెబెల్స్‌ రాజీనామాలు ఆమోదించవద్దని స్పీకర్‌కు కాంగ్రెస్‌ వినతి

ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల షాక్‌.. బీజేపీకి మద్దతు

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ముఖ్యనేతలు సోమవారం చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్‌ నుంచి 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన 9 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు.

మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకం మరింత రంజుగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు, జేడీఎస్‌ ప్రతినిధులు ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరతో సమావేశమైన సీఎం కుమారస్వామి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

మంత్రుల రాజీనామా నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని అధికారిక వర్గాలు తెలిపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం 34 మంత్రి పదవులకు గానూ కాంగ్రెస్‌ 22, జేడీఎస్‌ 12 మంత్రి పదవులను తీసుకునేలా ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది. అయితే తమకు న్యాయం జరగలేదంటూ 13 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కాగా, ఈ రాజీనామాలను ఆమోదించవద్దని కాంగ్రెస్‌ న్యాయవిభాగం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కోరింది. ఈ ఎమ్మెల్యేలు నియమ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించలేదని స్పష్టం చేసింది.

ఇద్దరు మంత్రుల రాజీనామా
కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార కూటమికి మరో షాక్‌ తగిలింది. ఇటీవల కుమారస్వామి కేబినెట్‌లో మంత్రులుగా నియమితులైన స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్‌.నగేశ్, ఆర్‌.శంకర్‌లు తమ మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. సోమవారం ఉదయం బెంగళూరులోని రాజ్‌భవన్‌కు చేరుకున్న నగేశ్, గవర్నర్‌ వజూభాయ్‌వాలాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తాను మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నగేశ్‌ లేఖలో తెలిపారు.

ఒకవేళ గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే మంత్రి ఆర్‌.శంకర్‌ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు. మరోవైపు తన సమస్యలను పరిష్కరించకుంటే అధికార కూటమిని వీడుతానని మంత్రి రహీమ్‌ మహమూద్‌ ఖాన్‌ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ తనను అవమానించిందనీ, అందుకే త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని బహిష్కృత ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ ప్రకటించారు. మంగళవారం జరిగే సీఎల్పీ భేటీని తాను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

తుది నిర్ణయం అధిష్టానానికే
పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌ మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ‘సోమవారం మేం మంత్రులతో భేటీ అయ్యాం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలిపెట్టారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీని నిలువరించేందుకు మంత్రులు చేసిన త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

బీజేపీ ఇప్పటికే ఐదుసార్లు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది’ అని వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన నేతలు తిరిగివస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయమై కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ‘పార్టీపై మాకు పూర్తి విశ్వాసముంది. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాంగ్రెస్‌ మంత్రులు శివనదా పాటిల్, ఆర్వీ దేశ్‌పాండేలు వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాకపోయినా రాజీనామాకు తమ సమ్మతిని తెలియజేశారు. సామాజిక న్యాయం, ప్రాంతం, అర్హతల ఆధారంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుంది’ అని తెలిపారు.  

నేను దేనికీ భయపడను: కుమారస్వామి
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై సీఎం కుమారస్వామి తొలిసారి నోరువిప్పారు. తాను దేనికీ భయపడబోననీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరి పాలించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడంపైనే నేను దృష్టి సారించా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నేను దృష్టి సారించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌వాలా ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆరోపించారు.

గోవాకు రెబెల్‌ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్‌–జేడీఎస్‌కు చెందిన 13 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరారు. 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గోవాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బీజేపీ ముంబై యువమోర్చా అధ్యక్షుడు మోహిత్‌ వీరితో ఉన్నట్లు వెల్లడించాయి. వీరంతా గోవా శివార్లలోని ఓ రిసార్టులో బస చేస్తారని పేర్కొన్నాయి.

నేటి నుంచి బీజేపీ ఆందోళన
కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.  కుమారస్వామి రాజీనామా చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఆందోళనలు చేపడతామని కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప హెచ్చరించారు.

కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు: రాజ్‌నాథ్‌
కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి తొలుత మాట్లాడుతూ..‘కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలను ముంబైలోని స్టార్‌ హోటల్‌కు తరలించారు. ఎమ్మెల్యేలు గవర్నర్‌ వజూభాయ్‌వాలాను కలిసిన వెంటనే అప్పటికప్పుడు కార్లు, విమానాలు, హోటల్‌ సదుపాయాలు ఏర్పాటైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.

303 మంది లోక్‌సభ ఎంపీలున్నప్పటికీ మీ కడుపు నిండలేదు. ఇప్పుడు మీ(బీజేపీ) కడుపు, ఢిల్లీ గేటు ఒకేలా కనిపిస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. దీంతో రాజ్‌నాథ్‌ స్పందిస్తూ..‘కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పార్టీలో పెద్దపెద్ద నేతలే(రాహుల్‌ గాంధీ, సింధియా తదితరులు) రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని రాహుల్‌ గాంధీయే ప్రారంభించారు’ అని తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలున్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత నగదు వెచ్చించారో చెప్పాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో డిమాండ్‌ చేసింది.

12 మందికి యెడ్డీ కేబినెట్‌లో చోటు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యడ్యూరప్ప నేతృత్వంలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని బీజేపీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వెల్లడించాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మాట్లాడుతూ..‘13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసినందున వారికి విప్‌ జారీ వర్తించదు. వీరి రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్‌ ఆలస్యం చేయగలరే తప్ప తిరస్కరించలేరు’ అని స్పష్టం చేశారు. ప్రభు త్వం పడిపోకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను వాయిదావేయడం లేదా రద్దుచేసే చాన్సుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

స్పీకర్‌ నిర్ణయమే కీలకం..
కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీనామాలన్నీ పద్దతి ప్రకారం, నిర్ధిష్ట నమూనాలో ఉంటే వాటిని ఆమోదించడం తప్ప స్పీకర్‌ మరో ప్రత్యామ్నాయం ఉండదు. అయితే, ఆమోదానికి కొంత వ్యవధి తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించవచ్చు. లేదా బలపరీక్షకు సిద్ధంకావాలని సీఎం కుమారస్వామిని ఆదేశించవచ్చు.

స్పీకర్‌ గనుక రాజీనామాలను ఆమోదిస్తే ఆ క్షణమే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోతుంది. కుమార స్వామి బలపరీక్షకు ఒప్పుకోకపోతే బీజేపీ అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పీకర్‌ను తొలగించాలని కూడా ఆ పార్టీ డిమాండు చేయవచ్చు. అదే జరిగితే సభలో బలపరీక్ష తప్పదు. ఒకవేళ స్పీకర్‌ నిర్ణయం సరిగా లేదని భావిస్తే ఇరు పక్షాల్లో ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

బలాబలాలు ఇలా...
224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాజీనామాల ముందు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి 118 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ 13 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 211కు తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 106 అవుతుంది. అదే సమయంలో అధికార జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి బలం 103కు పడిపోతుంది. ఇదే జరిగితే 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇద్దరు స్వతంత్రుల మద్దతు (107) తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది.


మీడియాతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, దినేశ్‌ గుండూరావు

మరిన్ని వార్తలు