సుప్రీంకు చేరిన కర్ణాటక సంక్షోభం

10 Jul, 2019 11:43 IST|Sakshi

న్యూఢిల్లీ/ముంబై : కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆమోదించకపోవడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. రెబల్‌ ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అంగీకరించారు.

కర్ణాటకకు చెందిన 14 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్‌ ప్రకారం ఉన్నాయని స్పీకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్‌ నిర్ణయంపై రెబల్‌ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పీకర్‌ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వహించడంలేదని విమర్శించారు.

ముంబైలో శివకుమార్‌కు చుక్కెదురు..
మరోవైపు రెబల్‌ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ను పోలీసులు లోనికి అనుమతించలేదు. మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్‌ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాయడంతో హోటల్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

పూటకో మలుపు..
కర్ణాటక రాజకీయం పూటకో ములుపు తిరుగుతోంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలోకి జారిపోయింది. సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్‌ హోటల్‌లో మకాం వేశారు. దీంతో రంగంలో దిగిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ముఖ్య నేతలు రాజీనామా చేసిన ఎమ్మేల్యేలను బుజ్జగించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభంతో తమకేలాంటి సంబంధం లేదని చెబుతున్న బీజేపీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అంతర్గత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని.. త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందని చెబుతున్నారు. 

చదవండి: కర్నాటకంలో కొత్త ట్విస్ట్‌

రెబల్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌ వద్ద హైడ్రామా

మరిన్ని వార్తలు