రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘కర్ణాటక’ జోష్‌ 

20 May, 2018 02:48 IST|Sakshi

  గాంధీ భవన్‌లో నేతల సంబురాలు

  ప్రజాస్వామ్యం గెలిచిందన్న ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నింపాయి. ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడం, కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై టీపీసీసీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్‌లో మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్‌కుమార్‌ యాదవ్‌ల నేతృత్వంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సీఎల్పీ కార్యాలయ సిబ్బందికి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్వీట్లు తినిపించారు. ఇది రాహుల్‌ గాంధీ విజయమని, ఈసారి ఆయన ప్రధాని కావడం ఖాయమంటూ నినాదాలు చేశారు. 

ఆ ఎమ్మెల్యేలకు సెల్యూట్‌ చేస్తున్నా: ఉత్తమ్‌ 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామానికి గొప్ప విజయం లభించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయానికి గుణపాఠం చెప్పడం శుభ పరిణామమని, కర్ణాటక పరిణామాలు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి మంచి చేస్తాయన్నారు. కర్ణాటక విధాన సభలో రాజ్యాంగం రక్షించబడిందని, ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్‌రెడ్డి, వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. 

కష్టానికి ఫలం... 
కన్నడ రాజకీయానికి హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారడం కూడా కాంగ్రెస్‌ నేతలకు సంతోషం కలిగిస్తోంది. ‘మా అధినాయకత్వం ఆదేశాల మేరకు శుక్రవారమంతా మేం చాలా కష్టపడ్డాం. బడా నేతలతోపాటు ఎమ్మెల్యేలందరికీ ఏ లోటూ రాకుండా ఆతిథ్యం ఇచ్చాం. విమానాశ్రయం నుంచి హోటళ్లకు, హోటళ్ల నుంచి బెంగళూరుకు తరలించే వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇప్పుడు మేం అనుకున్నట్లుగా విజయం సాధించడం చాలా తృప్తిగా ఉంది. ఈ కష్టంలో మాకూ భాగముందనే భావన వస్తోంది. ఇది కచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్‌కూ శుభ పరిణామమే’అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు