చంద్రబాబూ.. చిచ్చుపెట్టకు

26 Apr, 2018 09:37 IST|Sakshi

చంద్రబాబు అసమర్థత వల్లే వలస వచ్చాం

ఇక్కడా రాజకీయాలు చేసి చెడగొట్టవద్దు

టీవీ చర్చాగోష్టిలో తెలుగువారి ఆవేదన

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఉన్న తెలుగువారికి రాజకీయ రంగు పులమొద్దని తెలుగు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మరో కర్ణాటక–తమిళనాడు సమస్యగా మార్చవద్దని, ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి అవకాశాలు లేక తామందరం బెంగళూరుకు వలస వచ్చి బతుకుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే తమకీ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం కర్ణాటకలో తెలుగువాడి ఓటు ఎవరికి అంటూ ఒక తెలుగు టీవీ చానెల్‌ చర్చ నిర్వహించింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. కర్ణాటకలో కన్నడిగులు తమతో సోదర భావంతో ఉన్నారని, మాకు, వారికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. తమపై ఒక పార్టీ ముద్ర వేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు తమకు మధ్య విద్వేషాలు పెరుగుతాయని చెప్పారు.

తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నామో, ఏ నాయకుడు అయితే మేలు చేకూర్చుతారని విశ్వసిస్తామో వారికే ఓటు వేస్తామన్నారు. బెంగళూరులో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని, ఇక్కడికొచ్చి బీజేపీకి ఓటు వేయొద్దు.. కాంగ్రెస్‌కు ఓటెయొద్దు అంటూ పిలుపునివ్వడం సమంజసం కాదని తెలిపారు. ఇటీవల ఇక్కడకు వచ్చిన ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బీజేపీకి ఓటు వేయొద్దని కోరడం సరికాదని చెప్పారు. ఇలాంటి మాటలతో తెలుగువారిపై ద్వేషభావాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అసమర్థత, చేతకానితనం వల్లే తాము వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నామన్నారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు కర్ణాటకలో టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రి గురించి చర్చ లేవనెత్తారు. చంద్రబాబు అసమర్థతను కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు