ఉత్తమ్‌ ఓ అజ్ఞాని: కర్నె ప్రభాకర్‌

31 Oct, 2018 02:43 IST|Sakshi

అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శ

సాక్షి,హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ అజ్ఞాని అని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న ఆయన తన పేరును గాలికుమార్‌రెడ్డిగా మార్చుకో వాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కర్నె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తమ్‌ లాంటి అజ్ఞాని పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం కాంగ్రెస్‌ పార్టీ దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

సీఎం కేసీఆర్‌ కంటిపరీక్షల కోసమే ఢిల్లీ వెళ్లారని అందరికీ తెలుసని, ప్రధాని మోదీ జపాన్‌ పర్యటనలో ఉంటే ఆయనను కేసీఆర్‌ ఢిల్లీలో ఎలా కలుస్తారని ప్రశ్నించారు. సోనియాగాంధీ కూడా ఆరునెలలకోసారి అమెరికా వెళ్తున్నారని, దేశ భద్రతకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే అక్కడికి వెళ్తున్నారని మేము అనగలమని కానీ మాట్లాడేటపుడు విచక్షణ కోల్పోకూడదని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్య లను ఉత్తమ్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.  

యాష్కీ క్షమాపణలు చెప్పాలి: సుధారాణి
నిజామాబాద్‌ ఎంపీ కవితపై వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీ క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి డిమాండ్‌ చేశారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మధుయాష్కీపై గతంలో గొనె ప్రకాశ్‌రావు ఆరోపణలు చేశారని, వాటిపై సమాధానం ఇవ్వకుండా పారిపోయిన యాష్కీ ఇప్పుడు కవిత అవినీతి పరురాలంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 

మరిన్ని వార్తలు