రైతుబంధును బహిష్కరించే దమ్ముందా? 

15 May, 2018 01:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బంధు పథకాన్ని బహిష్కరించే దమ్ము కాంగ్రెస్‌ నేతలకు ఉందా అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రైతుబంధు ద్వారా పెట్టుబడికోసం ఎకరానికి 4వేల రూపాయలు, పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందాన్ని కాంగ్రెస్‌ నేతలు చూడలేకపోతున్నారని ఆరోపించారు. దమ్ముంటే కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు పథకాన్ని సూటిగా వ్యతిరేకించాలన్నారు. దీనిని బహిష్కరిస్తున్నామని బస్సుయాత్ర వేదికగా ప్రకటించే దమ్ముందా అని సవాల్‌ చేశారు. బస్సుయాత్రలో 60 మంది సీఎం అభ్యర్థులు పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాట్లాడుతూ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని కర్నె వ్యాఖ్యానించారు. ఇలాంటి బాధ్యతారహిత కాంగ్రెస్‌లాంటి పార్టీ ప్రతిపక్షంలో ఉండటమే దురదృష్టమన్నారు. తుపాకీరామునిలాగా ఉత్తమ్‌ మాట్లాడుతున్నాడని అన్నారు. రైతులను ఆదుకోవాలని, పొలాలకు సాగునీరు ఇవ్వాలని, వారికి పెట్టుబడి అందించాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని ఎవరూ మార్చలేరని కర్నె చెప్పారు. కౌలు రైతుల పేరుతో కపట నాటకం ఆడుతున్న కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడం ప్రభుత్వాలకు కొత్తకాదని, టీఆర్‌ఎస్‌పై అనవసర ఆరోపణలు సరికాదన్నారు. 

మరిన్ని వార్తలు