కాంగ్రెస్, టీడీపీ పొత్తు నీతిమాలిన చర్య: కర్నె

12 Sep, 2018 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ సిద్ధాంతాలను వదిలేసి ఎన్నికల కోసం కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం నీతిమాలిన చర్య అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. టీఎస్‌ఐడీసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లుతో కలసి కర్నె మంగళవారం తెలం గాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ తోక పార్టీలన్నీ కలసి కూటమి అవుతాయని మేము ముందు నుంచి చెబుతున్నదే నిజమవుతోంది.

బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన టీడీపీతో పొత్తు కోసం కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ అభివృద్ధి చెందాలని బాబు ఎందుకు కోరుకుంటారు? టీడీపీతో పొత్తుపై నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించాలి. వచ్చే ఎన్నికలు అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరిగే ఎన్నికలు. తప్పు జరిగి వారు గెలిస్తే అమరావతి నుంచి ఇచ్చే సూచనలతోనే ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అరెస్టుతో టీఆర్‌ఎస్‌కు  సంబంధం లేదు. గతంలో నమోదైన కేసు విచారణలో భాగంగానే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు’అని తెలిపారు.

మరిన్ని వార్తలు