మహాసభలపైనా విమర్శలేనా?: కర్నె

14 Dec, 2017 02:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన యాస, భాషకు చక్కటి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను అందరూ భావిస్తుంటే కొందరు కువిమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. భాష, ప్రాంతం వేర్వేరన్న సంగతిని గుర్తించలేని వారే ఇలా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ యాసతో మాట్లాడనివ్వని పరిస్థితుల్లో భాషకు తల్లులు ఉండరని ఉద్యమంలో చెప్పామని భరతమాత, తెలంగాణ తల్లి మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రమాత ఉండేదని, కుట్రతో తెలుగుతల్లిగా మార్చారని అన్నారు. ఉద్యమసమయంలో తాము తెలుగుతల్లినే తప్ప ఆంధ్రమాతను విమర్శించలేదని గుర్తుచేశారు. ఇంటి పండుగ వంటి ప్రపంచ తెలుగు మహాసభలను శపిస్తూ మాట్లాడటాన్ని ప్రజలు సహించరని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలకు కమీషన్లే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు