‍కరుణానిధితోనే ఇవి సాధ్యమయ్యాయి

7 Aug, 2018 22:24 IST|Sakshi

దాదాపు యాభై ఏళ్ల క్రితం (1970 ఫిబ్రవరిలో) తిరుచ్చిలో జరిగిన డీఎంకే మహాసభలో ’రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు, కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ’ (మానిలాతిలే సుయాచ్చి, మతిఇలేకూటచ్చి)అనే నినాదాన్ని కరుణానిధి మళ్లీ వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. దీనికి అక్కడి ప్రజల నుంచే కాకుండా, వివిధ రాష్ట్రాల్లోని రాజకీయపార్టీలు,నాయకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కేంద్ర,రాష్ట్ర సంబంధాల్లో నూతన మార్పులు అవసరమన్న  పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై  తీసుకొచ్చిన ఈ డిమాండ్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా మళ్లీ ఈ నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, హక్కుల విషయంలో కేంద్రం జోక్యాన్ని డీఎంకే ఆధ్వర్యంలో ఆయన గట్టిగా అడ్డుకున్నారు. అన్నాదురై అడుగుజాడల్లోనే ఈ అంశానికి కరుణానిధి అత్యంత ప్రాధాన్యతినిచ్చారు. రాష్ట్రాలకు తగినన్నీ అధికారాలిస్తేనే కేంద్రం ఆదర్శవంతంగా ఉన్నట్టుగా భావిస్తామని, అదే దేశ సమైక్యత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తాయన్న అన్నాదురై వాదనను ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు. 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్కారియా కమిషన్‌ కేంద్రరాష్ట్ర సంబంధాలు అధ్యయనం చేయడానికి 14 ఏళ్ల ముందే 1974లోనే  రాజమన్నార్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ  తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి ప్రభుత్వం  తీర్మానం ఆమోదించింది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు పూర్తి ప్రతిపత్తిని కల్పించేందుకు వీలుగా భారత రాజ్యాంగానికి వెంటనే అవసరమైన మార్పులు చేయాలంటూ ఇందులో కేంద్రాన్ని డిమాండ్‌చేశారు.

భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన కాలం నుంచి చూస్తే  1974లో చేసిన ఈ తీర్మానానికి దేశ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని  తమిళరచయిత ఆలి సెంథిలినాథన్‌ పేర్కొన్నారు.  కరుణానిధి సీఎంగా ఉన్న 1970-75 మధ్యకాలం తమిళనాడుకు స్వర్ణయుగంగా పిలవవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పన అనే ఆలోచనను మళ్లీ చర్చనీయాంశం చేయడం వల్ల అదే తమిళనాడు రాజకీయ సిద్ధాంతంగా మార్పు చెందిందన్నారు.

1970 నుంచే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక పతాకం (జెండా) ఉండాలనే డిమాండ్‌కు కరుణానిధి ప్రాచుర్యం కల్పించారు. 1974 వరకు స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్రాల సీఎంలకు జాతీయపతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత  సీఎంలకు ఆ హక్కు కల్పించారు. 

దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు అధికారంలో ఉన్న కాంగ్రేసేతర డీఎంకే ప్రభుత్వం ఒక్కటే ఎమర్జెన్సీని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే కరుణానిధి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దుచేసింది. డీఎంకే పార్టీ నాయకులు చాలా మంది ఎమర్జెన్సీ ఎత్తేసేవరకు జైళ్లలోనే ఉండాల్సి వచ్చింది. 

1980 దశకం చివర్లో దేశంలో సంకీర్ణ రాజకీయాల వ్యూహాకర‍్తగా కరుణానిధి పేరుగాంచారు. 1983లో శ్రీలంక తమిళుల సమస్యపై కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకున్నారు. వీపీసింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత‍్వం ఏర‍్పడడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. జాతీయ రాజకీయ క్షేత్రంలో ఓ ప్రాంతీయపార్టీ నేత కీలకపాత్ర పోషించడం గొప్ప విషయమని రాజకీయ పరిశీలకులు  అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు