కరుణానిధి కనిపించారు!

20 Oct, 2017 09:31 IST|Sakshi
మురసోలి కార్యాలయంలో కరుణానిధి

సాక్షి, చెన్నై: డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి గురువారం సాయంత్రం అనూహ్యంగా దర్శనమిచ్చారు. పార్టీ అధికార పత్రిక మురసోలి వేడకల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు. కరుణానిధి అనూహ్యంగా ఇక్కడికి రావడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆనందం పెల్లుబుక్కింది. మళ్లీ తమ అధినేత రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వచ్చేమో అనుకుంటూ కార్యకర్తలు ఊహాగానాలు చేశారు.

94 ఏళ్ల కరుణానిధి దాదాపు ఏడాదిగా రాజకీయ రంగానికి దూరంగా ఉన్నారు. ఆయన చివరిసారి గత ఏడాది డిసెంబర్‌ 23న ప్రజలకు కనిపించారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మృతిచెందిన 18 రోజుల అనంతరం కరుణానిధి ఆస్పత్రి నుంచి డిశార్జ్‌ అయిన సందర్భంగా ప్రజలకు చివరిసారి కనిపించారు.

వీల్‌చైర్‌లో కరుణానిధి రావడంతో సంబరంలో మునిగిపోయిన డీఎంకే కార్యకర్తలు 'తలైవర్‌' 'తలైవర్‌ పెద్దపెట్టున' హర్షధ్వానాలు చేశారు. కరుణానిధి రాక డీఎంకే కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. కార్యకర్తల సందోహాన్ని గుర్తించినట్టుగా కరుణానిధి చేతితో సైగలు చేశారు. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. వెంటనే ఆయనను గోపాలపురంలోని నివాసానికి తరలించారు.

గత డిసెంబర్‌లో కరుణానిధికి శ్వాసకోశనాళానికి సంబంధించి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన బయటకు రావడంలేదు. అతికొద్దిమంది సందర్శకులను మాత్రమే ఆయనను కలిసేందుకు అనుమతిస్తున్నారు.

మరిన్ని వార్తలు