కరుణ వెర్సస్‌ జయ

7 Aug, 2018 21:48 IST|Sakshi

అర్ధరాత్రి కటకటాల వెనక్కి కరుణ
అసెంబ్లీలో అవమానానికి ప్రతీకారంగానే జయలలిత అధికారంలోకి రాగానే కరుణానిధిని అర్ధరాత్రి కటకటాల వెనక్కి పంపిం చారు. 2001, జూన్‌ 30.. కరుణ జీవితం లో అదొక చీకటి రాత్రి.12 కోట్ల ఫ్లై ఓవర్‌ కుంభకోణంలో కరుణానిధి ప్రమేయం ఉందంటూ పోలీసులు వీల్‌చైర్‌ మీద ఉన్న కరుణను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారు. పోలీసులు తనను చంపడానికి ప్రయత్నిస్తారంటూ కరుణ గగ్గోలు పెడుతున్నా ఆయన మాట వినే నాథులే అక్కడ కరువయ్యారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. కానీ తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత జీవితాంతం కత్తులు దూసుకుంటూ నే ఉన్నారు. బహిరంగంగానే ఒకరి మీద మరొకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ఇద్దరు నేతలు పగ, ప్రతీకారాలతోనే రగిలిపోయారు. బలమైన వ్యక్తిత్వం, పట్టుదల, పంతం, ప్రజల్లో చరిష్మా ఉన్న ఇద్దరు నేతలు ఢీ కొంటే రాజకీయం ఎలాంటి అనూహ్య మలుపులు తిరుగుతుందో తమిళనాడు రాజకీయాల్ని చూస్తే అర్థమవుతుం ది. కరుణ, జయ రాజకీయ జీవితంలోకి తొంగి చూస్తే ఇలాంటి దృష్టాంతాలు కోకొల్లలు. 

పార్టీల మధ్య శత్రుత్వం
ఎంజీఆర్, కరుణానిధి ప్రాణస్నేహితులైనప్పటికీ డీఎంకే పార్టీని వీడి ఎంజీఆర్‌ ఎప్పుడైతే అన్నాడీ ఎంకే పార్టీ పెట్టారో అప్పటి నుంచీ ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.. జయలలిత పార్టీ పగ్గాలు చేపట్టాక ఇరు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. కరుణ, జయ పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు వెళ్లిపోయింది. 

నిండు సభలో దుశ్శాసన పర్వం
తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జయలలితపై సాగిన దుశ్శాసన పర్వంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చేసింది. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే, విపక్ష ఏఐడీఎంకే మధ్య ఒక అంశానికి సంబంధించి వాగ్వాదాలు కొనసాగాయి. ఒకానొక దశలో జయలలిత కరుణానిధిని కుట్రవలి (క్రిమినల్‌) అంటూ మాట తూలారు. దీంతో కరుణానిధి కూడా జయలలిత వ్యక్తిగత జీవితంపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. మరోవైపు రెచ్చిపో యిన డీఎంకే సభ్యులు జయను చుట్టుముట్టారు. మంత్రి దురై మురుగన్‌ జయ జుట్టు పట్టుకొని లాగారు. అంతటితో ఆగక చీర కూడా లాగారు. చీర చిరిగిపోవడంతో సభలో పరిస్థితులు చేజారిపో యాయి. నిండు సభలో కన్నీరు పెట్టిన జయలలిత తనకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేదు. అప్పట్నుంచే ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు వేదికైంది. వరుసగా ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టని పరిస్థితులున్న తమిళనాడులో ఎవరు అధికారం లోకి వస్తే వారే పై చేయి సాధించుకోవడానికి వ్యూహాలు పన్నారు. 

స్టాలిన్‌పై జయ కరుణ
కరుణపై కత్తులు దూసిన జయలలిత ఆయన కుమారుడు స్టాలిన్‌పై మాత్రం కరుణ చూపించేవారు. అందుకే జయలలిత ఆఖరి క్షణాల్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్టాలిన్‌ అపోలోకి వెళ్లి ఆమెను చూసి వచ్చారు. అదేవిధంగా కరుణానిధి భార్య రజతమ్మాళ్‌కు (కనిమొళి తల్లి) కూడా జయలలిత అంటే చాలా ఇష్టం. జయని చూడటానికి ఎవరినీ అనుమతించని అపోలో ఆస్పత్రిలో రజతమ్మాళ్‌కు మాత్రం అనుమతి లభించింది. కరుణ, జయ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే సాహసం అటు తమిళ సినీ పరిశ్రమకు చెందినవారు కానీ, ఇటు రాజకీయ నేతలు కానీ చేయలేదంటేనే వారిద్దరిలోనూ ఎంత మొండి పట్టుదల ఉందో అర్థం చేసుకోవచ్చు.

సన్‌ వర్సెస్‌ జయ
ఇరువురు నేతల మధ్య విభేదాలు వారి వారి సొంత చానెళ్లలోనూ ప్రతిఫలిం చాయి. కరుణానిధికి చెందిన సన్‌ నెట్‌వర్క్, ఏఐఏడీఎంకే జయ టీవీ వార్తల్ని వండి వార్చడంలో ఎవరి కోణం వారిదే. ఒకే అంశంపై రెండు టీవీల్లోనూ రెండు విభిన్నమైన కథనాలు కనిపించేవి. కరుణానిధి అరెస్ట్‌ వార్తను సన్‌ టీవీలో పోలీసులు ఈడ్చుకు వెళ్లినట్టు చూపిస్తే, జయ టీవీలో కరుణ అరెస్ట్‌కు సహకరించకుండా ఎంత ప్రతిఘటించారో చూపించారు. అదే అరెస్ట్, అవే దృశ్యాలు ఎవరి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారు వాడుకున్నారు.

మరిన్ని వార్తలు