మేనిఫెస్టోలో పసుపుబోర్డు ఏదీ?

9 Apr, 2019 03:37 IST|Sakshi
నందిపేట్‌ సభలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత

బీజేపీకి ఎంపీ కవిత ప్రశ్న 

చిత్తశుద్ధి ఉంటే ఈ అంశాన్ని చేర్చాలి 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపుబోర్డు అంశంపై బీజేపీ మరోసారి మాట తప్పిందని నిజామాబాద్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పసుపుబోర్డు అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దీన్ని బట్టి బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని మరోసారి రుజువైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందిపేట్‌లో జరిగిన బహిరంగ సభలో కవిత మాట్లాడారు. ‘‘రాంమాధవ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఇచ్చిన హామీ మేరకు పసుపుబోర్డును బీజేపీ మేనిఫెస్టోలో చేర్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినా, పెట్టకపోయినా ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పసుపుబోర్డును సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల తర్వాత ఎర్రజొన్న రైతులకు బోనస్‌ ఇవ్వనున్నట్లు కవిత ప్రకటించారు. 

మైదానం నుంచి కాంగ్రెస్‌ పరార్‌ 
ఈ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ మైదానం వదిలిపారిపోయిం దని కవిత ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం లో ఆ పార్టీ అభ్యర్థి కనీసం మండల కేంద్రానికి కూడా రాలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు.
 
ఇళ్లు, వైద్యానికి పెద్దపీట  
గడిచిన ఐదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో చెరువుల అభివృద్ధి వంటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని, రానున్న ఐదేళ్లలో నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, వైద్యం అందించే అంశాలకు పెద్దపీట వేస్తామని కవిత ప్రకటించారు. లబ్ధిదారులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని అన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి రానున్న రోజుల్లో ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని కవిత అన్నారు. 

బీడీ కార్మికులను ఆదుకున్నాం 
కార్ఖానాలు మూత పడటంతో బీడీ కార్మికులకు సరిగ్గా పనులు దొరకని పరిస్థితి నెలకొందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు కేసీఆర్‌ సర్కారు పెన్షన్లు ఇస్తోందని, వచ్చే నెల నుంచి ఈ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు, యాదవ సోదరులు, ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు