దిగజారుడు మాటలు మానుకో..

3 Oct, 2018 03:56 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ కవిత

     మధుయాష్కీపై ఎంపీ కవిత ఆగ్రహం 

     నియోజకవర్గం ముఖం చూడని వ్యక్తి మాపై విమర్శలా? 

     నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: పోచారం  

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ దిగజారుడు మాటలు మానుకోవాలని ఎంపీ కవిత అన్నారు. మంగళవారం నిజామా బాద్‌ లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని, ఓటమి పాలయ్యాక కనీసం నియోజకవర్గం ముఖం కూడా చూడని యాష్కీకి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆయనలా తాను దిగాజారుడు మాటలు మాట్లాడనని, ఆయన భాష మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో నిజామాబాద్‌ –పెద్దపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం కోసం కేవలం రూ.440 కోట్లు కేటాయిస్తే, తాను ఎంపీగా గెలిచాక రూ.500 కోట్లు  మంజూ రు చేయించానని చెప్పారు.

రైల్వేమంత్రి సదానంద గౌడ్‌ను 50 సార్లు కలసి వినతిపత్రాలు అందించా నని, రైల్వేశాఖపై ఒత్తిడి తెచ్చి దేశంలోనే అధిక ప్రాధాన్యత ప్రాజెక్టులో ఈ లైనును చేర్చానని కవిత పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను మధుయాష్కీ ఖర్చు చేయకపోవడంతో రూ.3.5 కోట్లు మురిగిపోయాయని, తాను ఎంపీగా గెలిచాక తిరిగి మంజూరు చేయించి అభివృద్ధి పనులకు వెచ్చించామన్నారు. లక్కంపల్లి సెజ్‌ భూములు పడావుగా మారి ఉంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లు మంజూరు చేయించి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇలా కుటుంబపాలనలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ నేతలకు కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కులేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. యాష్కీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 

మరిన్ని వార్తలు