కవిత నామినేషన్‌ దాఖలు

23 Mar, 2019 01:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ కవిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు అందజేశారు. అంతకు ముందు నగర శివారులో ఉన్న సారంగపూర్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో భర్త అనిల్‌కుమార్‌తో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ గుర్తు అయిన అంబాసిడర్‌ కారు (గులాబీరంగు)లో ఎమ్మెల్యేలతో కలసి ఆమె కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. 

ఢిల్లీలో సైనికులుగా పనిచేస్తాం: టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఐదేళ్ల పదవీ కాలంలో గల్లీలో ప్రజా సేవకులుగా, ఢిల్లీలో తెలంగాణ సైనికులుగా పని చేశారని కవిత వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలు దయతో తనకు మరోసారి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శక్తి వంచన లేకుండా పని చేశానని, జిల్లా, రాష్ట్ర, జాతీయ అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో కలసి రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. దేశంలో మారుతున్న పరిస్థితుల్లో 16 ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైకోర్టు, మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్లు, ఎయిమ్స్‌ వంటి అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించామని గుర్తు చేశారు. ఐదేళ్ల కాలంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ ఎంపీల నడవడికను గమనించారని, మరోసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిజామాబాద్‌ ఎంపీగా మొదటిసారి గెలిపించిన ప్రజలకు, మరోసారి తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ అధినేత కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ సభ్యులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరులు ఆమె వెంట ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు