ఈ ఏడాది జాగృతి బతుకమ్మ లేదు

6 Oct, 2018 01:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం లేదని సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేలా.. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఆడబిడ్డలను కోరారు. కవిత ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘తెలంగాణ జాగృతి నిర్వహించే బతుకమ్మను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేసిన దిగజారుడు ఆరోపణలు నన్ను బాధించాయి. తెలం గాణ జాగృతి ఉమ్మడి ఏపీలోగానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాతగానీ ప్రభుత్వం నుంచి ఏ రకంగానూ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈసారి ఎన్నికల సందర్భం అయినందున బతుకమ్మను రాజకీయాలకు ముడిపెట్టి నిరాధార ఆరోపణలు చేసేందుకు కొందరు కాచుకుని ఉన్నారని ప్రజలకు తెలుసు. అందుకే ఈ ఏడాది జాగృతి నుంచి బతుకమ్మ నిర్వహణ ఉండ దు.

దిగజారుతున్న రాజకీయాలకు బతుకమ్మ ఒక అంశం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ వాదులకు, తెలంగాణ ఆడబిడ్డలకు, జాగృతి అభిమానులకు సవినయంగా మనవి చేస్తున్నాను. సహృదయంతో అర్థం చేసుకుని, సహకరించగలరని కోరుతున్నాను. ఇది ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కనుక జాగృతి విదేశీ శాఖలకు వర్తించదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని సమున్నతంగా నిలిపే క్రమంలో తెలంగాణ జాగృతి ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

కవితను కలిసిన ఎర్రోళ్ల..
జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ప్రస్తుత ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడి యా ప్రచార ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కవితను శుక్రవారం కలిసినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎర్రోళ్లను జహీరాబాద్‌ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సిన 14 స్థానాలకు ఈ నెల 11న అభ్యర్థులను ప్రకటించనుందని తెలిసింది.

జగిత్యాలలో గులాబీ జెండా: కవిత
వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లాపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషిలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరిన వారితో సమన్వయం చేసుకోవాలని జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు సూచించారు.

జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కవిత వీరికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ జి.ఆర్‌ దేశాయ్, మాజీ కౌన్సిలర్‌ మానాల కిషన్‌తోపాటు బీసీ, ఎంబీసీ నేతలు చదువుల కోటేశ్, మర్రిపెల్లి నారాయణ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు