నేనేం కథలు చెప్పడం లేదు: కేసీఆర్‌

23 Nov, 2018 14:03 IST|Sakshi

దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆలోచించి ఓటేయ్యాలి

నర్సంపేట సభలో సీఎం కేసీఆర్‌

సాక్షి, నర్సంపేట : ఎన్నికలనగానే చాలా మంది వచ్చి చాలా చెబుతుంటారని, కానీ ప్రజలే రాష్ట్రానికి మంచి ఏదో ఆలోచించి ఓటేయాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సంపేట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలనగానే ఆగం కావద్దని,  58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు.. 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌లు బరిలో నిలిచాయన్నారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఎవరికి ఓటేయాలో జనమే విజ్ఞతతో ఆలోచించాలి. గతంలో తెలంగాణోళ్లకు తెలివి లేదని ఎద్దేవ చేసిన సమైక్యపాలకుల రాష్ట్రం కంటే మనం  అభివృద్ధి సాధించాం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఏం జరిగినాయో.. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ 24 గంటల కరెంట్‌ లేదు. కరెంట్‌ యొక్క తలసరి వినియోగంలో దేశంలోనే నెం1గా ఉన్నాం. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్లతో పాటు బీడీ కార్మీకులకు, బోధకాలు బాధితులకు పెన్షన్‌లిస్తున్నాం. అధికారంలోకి రాగానే ఈ పెన్షన్‌లను రెండింతలు చేస్తాం. కల్యాణ లక్ష్మీ పథకం వస్తుందని ఎవరూ ఊహించలేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణీ లక్ష్మీ పథకంతో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. నేనేం కథలు చెప్పడం లేదు. ఇవన్నీ జరుగుతున్నయే. మీరు చూస్తున్నవే. రైతు బంధులాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు.

ఐక్యరాజ్య సమితి గుర్తించిన 10 పథకాల్లో రైతు బంధు ఒకటి. రైతు భీమాను గుంట భూమి ఉన్న రైతుకు కూడా వర్తింపజేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టి తీరుతాం. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం. కాంగ్రెస్‌ నేతల అవినీతిని కక్కిస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బీడుభూముల సమస్యలను పరిష్కరిస్తాం.  తండాలను గ్రామపంచాయితీలుగా చేసినం. దీంతో గిరిజన సోదరులు గ్రామ సర్పంచ్‌లుకానున్నారు. రిజర్వేషన్లను పెంచాలని కేంద్రంతో కొట్లాడినం. అవి కూడా సాధిస్తాం. నర్సంపేటలో గత ఎన్నికల్లో దయ చూపలేదు. అయినా అన్ని పథకాలు కొనసాగించాం. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయించాం. 2001 నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పార్టీలో ఉండి కష్టపడుతున్నారు. ఆయనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. ఈ సారి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి.’ అని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు