ఇదేం చట్టం?

17 Mar, 2020 02:24 IST|Sakshi

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై సీఎం కేసీఆర్‌ ధ్వజం

సీఏఏను వెనక్కి తీసుకుని, పునఃసమీక్ష చేయాలి

సరిహద్దులో గోడ కడితే మేమంతా మద్దతిస్తాం..

సీఏఏను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

బీజేపీ మినహా అన్ని పార్టీల సభ్యుల మద్దతు

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రతిపాదనల అమలుపై సోమవారం అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్పీఆర్, ఎన్నార్సీ లాంటి చర్యల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ పక్షాన సీఎం కేసీఆర్‌ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడి తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీర్మాన ప్రతులను చించేసి స్పీకర్‌ పోడియం ముందు ఆందోళన చేస్తుండగానే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని సభ ముందు ఆమోదానికి ఉంచారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని మండలి సైతం ఆమోదించింది.

నిప్పులు చెరిగిన కేసీఆర్‌..
తీర్మానంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీఏఏతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోం దని మండిపడ్డారు. లౌకిక, ప్రజా స్వామిక, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కేంద్రం మంటగలుపుతోం దని నిప్పులు చెరిగారు. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్‌ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓసారి విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఏఏ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, దీనిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃసమీక్ష చేయాలని విన్నవించారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పార్లమెంట్‌లో సీఏఏను వ్యతిరేకించిందని, దానికే కట్టుబడి అసెంబ్లీలోనూ వ్యతిరేకంగా తీర్మానిస్తున్నామని ప్రకటించారు. సీఏఏతో దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రజాస్వామిక, లౌకికవాదులంతా దీన్ని నిరసిస్తున్నారని చెప్పారు.

వసుధైక కుటుంబవాదానికి వ్యతిరేకం..
తెలంగాణ తన సొంత నిర్మాణం చేసుకుంటూనే, దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశ సామాజిక భద్రతలో రాష్ట్ర భద్రత కూడా ఇమిడి ఉన్నందున సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ వివరించారు. వసుధైక కుటుంబంగా కలలు కంటున్న తరుణంలో, సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తున్న ఈ సమయంలో సీఏఏను తెరపైకి తేవడం సమంజసం కాదన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారు. కొందరు ఎంపీలు, కేంద్ర మంత్రులు దుర్మార్గంగా మాట్లాడారు. గోలీమారో సాలోంకు.. అంటూ బాధ్యత మరిచి వ్యహరించారు. దేశానికి ఇది వాంఛనీయం కాదు. దేశం ఇలాందిటి అంగీకరించదు. ఈ రాక్షాసానందం దేశానికి మంచిది కాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి దెబ్బతింటుంది. దేశానికి వేరే ఇతర సమస్యలేవీ లేనట్లు, ఇదొక్కటే సమస్య అన్నట్లు కల్లోలం లేపొద్దు’అని పేర్కొన్నారు.

బర్త్‌ సర్టిఫికేట్‌ లేని వారి సంగతేంటి?
‘సీఎంగా నాకే బర్త్‌ సర్టిఫికెట్‌ లేదు. చింతమడక ఇంట్లో పుట్టిన. జన్మపత్రికే ఉంది. బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి. దేశంలో నాలాగే కోట్లాది మంది సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితేంటి? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఓటరు కార్డు ఇచ్చారు. సీఏఏకు ఓటింగ్‌ కార్డు పనికి రాదు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు పనిచేయదంటున్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటర్‌ కార్డు కూడా సీఏఏకు పనిచేయదంటే ఎలా? దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పట్లేదు. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గోడ కడతామన్నారు. మయన్మార్‌ నుంచి చొరబాట్లు రాకుండా భారత్‌లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతామంటే మేమూ మద్దతిస్తాం’అని తెలిపారు.

వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా..
‘ముస్లింలను మినహాయించి కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్‌ ఏజెంట్లు అవుతారా? అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానిస్తే అసెంబ్లీలోని సభ్యులంతా దేశద్రోహులేనా. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎల్‌కే అడ్వాణీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తేల్చాయి. అలాంటి విఫల ప్రయోగం మళ్లీ అవసరామా? ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిశీకుల పరిస్థితేంటి? ఇతర ప్రాంతాల్లో వలసవచ్చి ఉంటున్న వారి పరిస్థితేంటి? విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా’అని సీఎం తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

ద్వంద్వ వైఖరి ఎందుకు..
‘పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఎన్నార్సీ చేస్తామని ఉంది. ఎన్నార్సీ చేయం.. ఎన్పీఆర్‌ మాత్రమే చేస్తామని కేంద్ర హోంమంత్రి అంటున్నారు. నివేదిక ఒకటుంటే, చెప్పేది ఇంకోటుంది. దేన్ని నమ్మాలి. అందుకే అగ్గి పుట్టింది. కేంద్రానికి ద్వంద్వ వైఖరి అక్కర్లేదు. దేశంలో 50–60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి.. ద్వంద్వ వైఖరి ఎందుకు? పౌరసత్వం ఇవ్వాలనుకుంటే రాద్ధాంతం అవసరం లేదు. నేరుగా ఇంకో విధానంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. 

ఎంఐఎంతో కలసి పనిచేస్తున్నంత మాత్రాన అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. కశ్మీర్‌ విషయంలో 370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతిచ్చింది మేమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం కేసీఆర్‌ వివరించారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్‌ ఎన్పీఆర్‌ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్‌పై స్టే తీసుకురావాలని అక్బరుద్దీన్‌ అడిగిన అంశంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఒకే భావజాలం ఉన్న ఇతర రాష్ట్రాలను సమీకరించి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఎన్పీఆర్‌పై స్టే తెచ్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు.

తక్షణమే అమలు నిలిపేయాలి: సీఎల్పీ నేత భట్టి
ఎన్పీఆర్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే సరిపోదని, ఆ చట్టం అమలు కాకుండా నిరోధించినప్పుడే తీర్మానానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం సీఏఏ, ఎన్పీఆర్‌ వ్యతిరేక తీర్మాన చర్చలో భట్టి మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దేశ పౌరుడో కాదో నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. బర్త్‌ సర్టిఫికెట్లు, మీ తల్లిదండ్రులు ఎక్కడివారనే సమాచారాలపై ధ్రువపత్రాలు ఇవ్వకపోతే.. శరణార్థి శిబిరాలకు పంపుతామనే కేంద్ర నిర్ణయం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా తన లాంటి వారెందరో ఎన్పీఆర్‌ నియామవళికి అనుగుణంగా ఈ దేశ పౌరులమో కాదో నిరూపించుకోవడం కష్టమన్నారు. ఈ దేశ పౌరులకు ఆందోళనకరంగా మారిన సీఏఏ, ఎన్పీఆర్‌ను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మోదీ ప్రభుత్వం ఈ సమస్యను ఒక మత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పౌరుల భద్రత, క్షేమం కోసం చట్టాలు చేయాల్సిన కేంద్రం కొన్ని వర్గాలను అణచివేసేలా చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలను తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కేరళ తరహాలో వాటి అమలు ప్రక్రియ నిలిపేస్తూ జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు.

మత ప్రాతిపదికన పౌరసత్యం సిగ్గుచేటు: సుమన్‌
మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. అందరూ సమానమనే రాజ్యంగ సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఎన్పీఆర్, సీఏఏ చట్టాలతో కేంద్రం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రగతిశీల, మేధోవర్గాలపై దాడులు చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. వసుధైక కుటుంబంలా జీవనం సాగిస్తున్న దేశ ప్రజల్లో పౌరసత్వ చట్టం కల్లోలం రేపిందన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడితోనే అన్నివర్గాల ప్రజలు సురక్షితంగా ఉంటారని సుమన్‌ అన్నారు.

తెలంగాణ విడిచి వెళ్లిపోతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌
సీఏఏ, ఎన్పీఆర్‌ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసిన మరుక్షణమే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటించారు. ఒక వర్గం మెప్పు కోసం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో కేసీఆర్‌ సర్కారు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పుకుండా.. ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పాక్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పాసంఖ్యాకులు అణచివేతకు గురవుతున్నారని, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నామే తప్ప.. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలోనూ ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ సర్వేలు జరిగాయని కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు రాద్ధాంతం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ధోకా చేయొద్దనే వ్యాఖ్యలపై అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌రెడ్డి మధ్యలో స్పీకర్‌ను కోరారు. మరోసారి రాజాసింగ్‌ మాట్లాడుతుండగా.. స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో తీర్మాన ప్రతులను చించి తన నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. 

చదవండి:
పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం
ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దు: అమిత్‌ షా
మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు

మరిన్ని వార్తలు