గులాబీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నపరెడ్డి

13 May, 2019 08:15 IST|Sakshi
(ఎన్‌సెట్)లో సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న చిన్నపరెడ్డి

సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసన మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికకు అధికార టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ అధినాయకత్వం డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదే నియోజకవర్గానికి 2015లో జరిగిన ఎన్నికల్లో తేరా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. కాగా ఆయన గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానికసంస్థల నియోజకవర్గం ఖాళీ అయ్యింది. ఈనెల 14వ తేదీతో (మంగళవారం) నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదివారం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.

కాగా, నల్లగొండ స్థానం నుంచి పలువురు టికెట్‌ ఆశించినా.. గత ఎన్నికల్లో (2015) ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపురెడ్డికే మళ్లీ అవకాశం ఇచ్చారు. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్‌ఎస్‌ వ్యూహా త్మకంగానే వ్యవహరించింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం తేరా చిన్నపరెడ్డి బాగానే ఖర్చు చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొన్నటి ఎంపీ ఎన్నికల సమయంలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు. కానీ, ఆయనకు ఆ టికెట్‌ దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయననే తిరిగి పోటీకి పెట్టాలని అధినాయకత్వం భావించిందని చెబుతున్నారు.
 
టీఆర్‌ఎస్‌లోనే.. ‘స్థానిక’ ఓటర్లు
గత ఎన్నికల సమయం నాటికి స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు అత్యధికులు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయా ఎన్నికల్లో వారు కాంగ్రెస్‌ పార్టీ నుంచే గెలిచారు. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారంతా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల సమయం నాటికి 1,110 మంది స్థానిక ఓటర్లు ఉండగా, వీరిలో మెజారిటీ  ఓటర్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారే. ఈ కారణంగానే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి గెలిచారన్నది సాధారణ అభిప్రాయం. కాగా, ప్రస్తుతం వీరిలో కొన్ని ఓట్లు తగ్గినా.. అత్యధికులు టీఆర్‌ఎస్‌లోనే ఉండడంతో ఈసారి తమ అభ్యర్థి ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఖాయమన్న విశ్వాసం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక ఓటర్ల బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేకే అప్పజెప్పారని అంటున్నారు. ఈ నెల 31వ తేదీన నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

ఇంకా ఖరారుకాని.. కాంగ్రెస్‌ అభ్యర్థి
నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. 2015 నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలేవీ చేస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానిక సంస్థల అభ్యర్థులంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు మారిపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాగా, నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నుంచి ముందుకు వచ్చి ఎవరు పోటీ చేస్తారో అన్న ఆసక్తి అన్ని వర్గాల్లో ఉంది. ఈ సారి అభ్యర్థిని బరిలోకి దింపుతుందా..? లేక పోటీకి దూరంగా ఉంటుందా అన్న అంశం తేలాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, పార్టీ వర్గాల్లో మాత్రం.. భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణరెడ్డి, సూర్యాపేట జిల్లాకు చెందిన పటేల్‌ రమేష్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నామినేషన్లకు రెండు రోజుల సమయమే ఉన్నందున కాంగ్రెస్‌ నాయకత్వం కూడా రేపో మాపో తమ అభ్యర్థిని ప్రకటిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తేరా చిన్నపరెడ్డి ప్రొఫైల్‌..

  • పేరు : తేరా చిన్నపరెడ్డి
  • తల్లిదండ్రులు : తేరా కోటమ్మ, తేరా పెద్దరాంరెడ్డి
  • కుటుంబం : భార్య కల్పన, కుమార్తెలు వీణారెడ్డి, రవళిరెడ్డి
  • పుట్టిన తేదీ : 10–08–1963
  • విద్యార్హతలు : బీఎస్సీ కెమికల్‌ టెక్నాలజీ, 1985లో పీజీ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, డాక్టరేట్‌ ఇన్‌ ఫార్మాసిటికల్‌ టెక్నాలజీ ఫ్రం వెస్ట్‌బ్రోక్‌ యూనివర్సిటీ యూఎస్‌ఏ
  • స్వస్థలం : పిన్నవూర, పెద్దవూర మండలం
  • వృత్తి నేపథ్యం : పారిశ్రామికవేత్త

పారిశ్రామిక రంగ నేపథ్యం : 1985లో పీజీ పూర్తి చేసిన తేరా చిన్నపురెడ్డి ఆ తర్వాత స్టాండర్డ్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో మొదట ఉద్యోగం పొందారు. ఆ తరువాత ఢిల్లీ సీఫామ్‌ ల్యామ్‌లోకి మారారు. ఔషధ రంగంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌లో సైంటిస్టుగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. ఆ తరువాత అమెరికా వెళ్లారు. 1993లో తేరా చిన్నపురెడ్డి కల్పనను వివాహం చేసుకున్నారు. 1994లో యూఎస్‌లోని ఫార్మా ఇండస్ట్రీస్‌లో అంతర్జాతీయ మార్కెటింగ్‌ విభాగంలో ఆరు సంవత్సరాల పాటు కెనడా, మెక్సికో, అమెరికా దేశాల్లో తిరుగుతూ పనిచేశారు. 1995లో నల్లగొండ జిల్లాలోని చౌట్టుప్పల్‌ సమీ పంలో శ్రీని ఫార్మా ఇండస్ట్రీస్‌ ప్రారంభించారు.

రాజకీయ నేపథ్యం : 2009లో నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి రాజకీయ ప్రవేశం చేసి కుందూరు జానారెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2014లో నల్లగొండ పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా తేరా చిన్నపురెడ్డి పోటీ చేసి గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2015లో నల్లగొండ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

మరిన్ని వార్తలు