కేసీఆర్‌ దీవెన.. ప్రజల ఆశీస్సులే నా బలం

15 Nov, 2018 01:24 IST|Sakshi
సిద్దిపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీవెనలు.. ప్రజల అండదండలే నా బలం’అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కేసీఆర్‌తో కలసి పూజలు చేశారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, పెద్ద మసీదు, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి అందచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతోపాటు సిద్దిపేట జిల్లా ప్రజల అభిమానంతో ఐదు సార్లు ఎన్నికల్లో గెలిచానన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి కష్టాలు తీర్చామని, కరెంట్‌ కోతలు లేకుండా చూశామని హరీశ్‌ వివరించారు. రాష్ట్రంలో సిద్దిపేట అంటే అభివృద్ధికి చిరునామాగా నిలిచామన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా చూశారన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు సేవకుడిగా ఉన్నానని, ఆ గుర్తింపే ఈ ఎన్నికల్లో కూడా తనకు విజయం సాధించి పెడుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీ తో తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పార్టీ నేతలు రాధాకృష్ణ శర్మ,మచ్చ వేణుగోపాల్‌రెడ్డి,గ్యాదరి బాలమల్లు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు