వచ్చేది.. మన సర్కారే

8 Dec, 2018 02:32 IST|Sakshi

పదిహేను రోజుల్లో మళ్లీ వస్తా

చింతమడక గ్రామస్తులతో కేసీఆర్‌  

సతీమణితో కలసి ఓటేసిన సీఎం

సాక్షి, సిద్దిపేట: ‘ఎక్కడా ఏమీ అనుమానం లేదు.. అంతా సర్దుకుంది. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు ఉండదు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది’అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన సతీమణి శోభారాణితో కలసి సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. జిల్లాలోని కొండపాక మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆయన సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకకు వచ్చారు. హెలికాప్టర్‌ దిగగానే తన చిన్నాన్న బాలకిషన్‌రావుకు పాదాభివందనం చేశారు.

అక్కడి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడే వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్‌ దంపతులు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి స్నేహితులతో కేసీఆర్‌ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని అన్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, మహిళలు ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని చెప్పారు.

రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్‌ అనుకూల పవనాలు వీస్తున్నాయని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందడి అయిపోయి.. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదిహేను రోజుల్లో గ్రామానికి మళ్లీ వస్తానని, మీ ఆశీస్సులు తీసుకొని గ్రామాభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. కేసీఆర్‌ వెంట మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు