‘సీఎంగా కేసీఆర్‌ సమాజానికి శ్రేయస్కరం కాదు’

1 Apr, 2018 16:53 IST|Sakshi
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌ : కేసీఆర్‌ తెలంగాణ సీఎంగా కొనసాగడం సమాజానికి శ్రేయస్కరం కాదని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ హోటల్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కాగ్ నివేదిక పరిగణలోకి తీసుకుంటే సీఎం ఆయన స్థానంలో కూర్చునే అవకాశం ఉండదన్నారు. సీఎం అబద్దాలు చెబుతున్నారని, అప్పులను ఆదాయంగా చూపించి, మరిన్ని అప్పులు తీసుకొచ్చేందుకు, కాంట్రాక్టర్లకు కమిషన్‌లు ఇచ్చేందుకు అంకెల మార్పు చేసి ఆర్థిక శాఖను సీఎం మోసగించారని ఆరోపణలు గుప్పించారు.

ఈ విషయంలో కాంగ్రెస్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని చూస్తోందని చెప్పారు. అప్పులు తీసుకునే దానికన్నా మించి అప్పులు తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్‌ తరాల్ని నాశనం చేయాలనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు. దళితులకు ముడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వ్యవహారంలో పదివేల కోట్ల రూపాయలు అకారణంగా అదనంగా ఖర్చు పెట్టారని అన్నారు. ఇవన్నీ కాగ్ తప్పు బట్టిందని, వీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేటీఆర్‌ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు కాంగ్రెస్‌పై మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రజా చైతన్య రెండోవిడత బస్సు యాత్ర ఆదివారం నుంచి మొదలవుతుందని, ఆదివారం సాయంత్రం 6 గంటలకు రామగుండం నియోజకవర్గంలో బహిరంగ సభ తెలిపారు.

సోమవారం ఉదయం కోల్ మైన్ వర్కర్స్, ఆన్ ఎంప్లాయ్ మెంట్ యూత్‌తో సంప్రదింపుల వ్యవహారం ఉంటుందన్నారు. ఒకటి నుంచి పదవ తేదీ వరకు బస్సుయాత్ర ఉంటుందని, టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలన వైఫల్యాలు, టీఆర్‌ఎస్‌ హామీలు- వాటి అమలు, ఇది మా సర్కార్ మా జాగీరు తదీతర అంశాలపై టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తామని వివరించారు. డిసెంబర్లో ఎన్నికలొస్తాయని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ సెషన్లో శాసన సభలో సీఎం, స్పీకర్ ప్రవర్తించిన తీరు, ఇద్దరు సభ్యులను ఎక్ స్పెల్ చేయడం, మిగిలిన వారిని సస్పెండ్ చేయడం, ప్రధాన ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ సెషన్ జరపడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ పాలనను ఎండగడతామని వివరించారు.

మరిన్ని వార్తలు