మినీ కేబినెట్‌.. నెలాఖరుకే!

17 Dec, 2018 00:59 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ..

తొలి విడతలో 6–8 మందికి అవకాశం

నూరు శాతం విధేయులకే అందలం

ఏ క్షణమైనా టీఆర్‌ఎస్‌లోకి 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు?

అందుకే మంత్రివర్గ కూర్పులో ముఖ్యమంత్రి జాప్యం!

అసెంబ్లీ సెషన్, ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక నెల చివర్లోనే..

అధికారుల నియామకంలోనూ అన్ని అంశాలు పరిగణనలోకి

నిబద్ధత, పనితీరు ఆధారంగా ముఖ్య శాఖలకు అధికారుల ఎంపిక

ఈలోగా వివిధ శాఖల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈసారి తనదైన శైలిలో ముందుకెళ్లనున్నారు. మంత్రివర్గ కూర్పు, విస్తరణ, ముఖ్య శాఖలకు అధికారుల ఎం పిక, అభివృద్ధి పనుల పురోగతి లాంటి అంశాల్లో కచ్చితత్వంతో ఉండాలని, మొహమాటాలకు పోకుండా నిబద్ధత, పనితీరు ఆధారంగానే నిర్ణ యాలు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. అం దులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని ఆచితూచి చేపట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌... ఈ నెలాఖరు నాటికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 6 నుంచి 8 మందికే మంత్రులుగా అవకాశం కల్పిస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో కేబినెట్‌ను కేసీఆర్‌ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖర్లో అసెంబ్లీ తొలి సెషన్‌ ఏర్పాటు చేసి అప్పుడే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని, అంతకు ముందు తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. అలాగే కీలక శాఖలకు అధికారుల నియామకాన్ని కూడా ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే ముఖ్యమైన శాఖలకు పాలనాదక్షత ఉన్న అధికారులే ఉండాలనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. ఈలోగా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టడం, మిషన్‌ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. 

కేబినెట్‌కు తొందరేం లేదు... 
మంత్రివర్గ విస్తరణకు తొందరేం లేదనే భావనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులను, భవిష్యత్తులో చేయాల్సిన పనులను ముఖ్యమంత్రి బేరీజు వేస్తున్నారు. దీనికితోడు రాజకీయంగా జరిగే పరిణమాలను కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన 88 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకుతోడు పార్టీలో చేరిన ఇద్దరు స్వతంత్రులు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే మొత్తం 97 మంది శాసనసభ్యులు అధికారపక్షం వైపే ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది సభ్యులు తమతో కలవడానికి ఇప్పటికే రాయబారాలు పంపారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా కనీసం 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి సీఎం కేసీఆర్‌ వచ్చినట్లు తెలిసింది. సీఎం అభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అది కూడా తొలి విడతలో 6 నుంచి 8 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవచ్చని సమాచారం. 

పనితీరే ప్రాతిపదిక... 
ఈసారి మంత్రివర్గ ఏర్పాటును ముఖ్యమంత్రి ఆషామాషీగా తీసుకోవట్లేదని, వివిధ రకాల సమీకరణాల మేరకు కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన జరిగేలా మంత్రులను నియమించాలనే భావనలో కేసీఆర్‌ ఉన్నారని తెలుస్తోంది. వ్యక్తుల కోసం కాకుండా పని కోసం మంత్రులను నియమించాలని, నూటికి నూరు శాతం విధేయులనే ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ధృడ నిర్ణయం తీసుకున్నారని సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, ఆవశ్యకతల జోలికి పోకుండా, మొహమాటాలకు తావు లేకుండా కేవలం పనితీరు ప్రాతిపదికగానే మంత్రివర్గ సహచరులను నియమించుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు సమాచారం. 

కొత్త ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభం... 
ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రమాణం చేసిన తర్వాతే ఎమ్మెల్యే అయినట్లనే విశ్లేషణలు సరైనవి కావని, గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచే ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభమైనట్లేనని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఒక సభ్యుడిగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడానికి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. గతంలోనూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలున్నాయి. 2014లో ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగి మే 16న ఫలితాలు వెలువడితే జూన్‌ 9న అంటే 23 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అది మరింత ఆలస్యమయింది. గతంలో కూడా అనేకసార్లు ఎమ్మెల్యేల ప్రమాణం రోజుల తరబడి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అంత తొందర పడాల్సిన అవసరం లేదనే భావనలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ప్రస్తుత హడావుడి ముగిశాక ఈ నెలాఖరు నాటికి అసెంబ్లీని సమావేశపరచి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలూ అప్పుడే నిర్వహించాలని కేసీఆర్‌నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

పెండింగ్‌ కార్యక్రమాలపై దృష్టి... 
మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక కార్యక్రమాలు నిర్వహించేలోగా గత మూడు నెలలుగా అవాంతరం కలిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్‌ గాడినపెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా సమీక్షలు ప్రారంభించిన ఆయన... మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. దీంతోపాటు మిషన్‌ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. వీటన్నింటితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలాగే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ వస్తుండటంతో ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. ఈ హడావుడి ముగిశాక నెలాఖరులో అసెంబ్లీ తొలి సెషన్‌ నిర్వహించాలని, అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు