అరాచక శక్తులను సహించేది లేదు

14 Mar, 2018 03:22 IST|Sakshi

కాంగ్రెస్‌ అరాచకాలు పరాకాష్టకు చేరాయి: సీఎం కేసీఆర్‌

వాళ్లకు ఇంత అసహనం ఎందుకు? 

ఓర్వలేక నాపైనా విష ప్రచారం

అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నారు 

అందుకే ఈ అసహనం.. కక్ష

మేం ప్రజలకు జవాబుదారీ

కాంగ్రెస్‌ సభ్యులపై నిర్ణయం సరైన చర్యే

నిన్నటి ఘటన బాధాకరం: అక్బర్‌

జానా సస్పెన్షన్‌ సరికాదు: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో అరాచక శక్తులు ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, అంతిమంగా వారే న్యాయ నిర్ణేతలని పేర్కొన్నారు. మంగళవారం సస్పెన్షన్‌ తర్వాత కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లిన అనంతరం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘గవర్నర్‌ ప్రసంగం సమయంలో జరిగిన ఘటన బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు మన అసెంబ్లీలో వస్తాయని ఊహించలేదు. నిర్ణయం కఠినతరమేగానీ తప్పదు.

మేం కొడదామనుకున్నది గవర్నర్‌నుగానీ మండలి చైర్మన్‌కు తగిలింది అన్నారు. కాంగ్రెస్‌ వారికి ఇంత అసహనం ఎందుకు? కాంగ్రెస్‌ అరాచకాలకు ఇది పరాకాష్ట. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన ఐదో రోజు నుంచే ఇది మొదలైంది. నేను ప్రధానిని కలిసేందుకు వెళ్తే... ఇక్కడ నా దిష్టిబొమ్మలు తగులబెట్టారు. టీఆర్‌ఎస్‌ జెండా గద్దెలు కూల్చారు. ఎన్నికలు అయ్యాక ప్రజల దీవెన తో మా ప్రభుత్వం వచ్చింది. అయినా కాంగ్రెస్‌ వారు ఇదే తీరుగా వ్యవహరించారు. ప్రభు త్వం ఉండదు కూలిపోతది అన్నరు.

ప్రభుత్వం గురించి చెప్పేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కాదు.. ప్రజలు. నాలుగేళ్లుగా ఎన్నో ఎన్నికలు జరిగాయి. కొన్నింట్లో ప్రతిపక్షం డిపాజిట్లు సైతం కోల్పోయింది. రెండు లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్, మున్సిపల్‌ ఎన్నికల ఫలితా లు చూశారు. అచ్చంపేట మున్సిపాలిటీలో అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే మొత్తం అన్ని సీట్లలో ఓడిపోయారు. అందుకే అసహనం, కక్ష. చివరికి నా మీద, నా ఆరోగ్యంపైనా ఏదో ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వెళ్తున్నానని, జబ్బు తగ్గదని ఇక రానని ప్రచారం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.

మేం ప్రజలకు జవాబుదారులం. స్పీకర్‌ నిర్ణయానికి ధన్యవాదాలు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి. ఓర్వలేక ఏదో చేయా లని చూస్తున్నారు. నేరస్తులు, అరాచక శక్తులను సహించేది లేదు. రాజకీయ నేతల ముసుగులో ఎవరైనా ఏదైనా చేస్తామంటే కుదరదు. అరాచక శక్తుల పీచమణచడంలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. మీ సమక్షంలో బీఏసీలో మాట్లాడితే.. ఏ అంశాలను ప్రతిపాదించినా చర్చిస్తామని చెప్పాం. గత సమావేశాలలో సభా సమయాన్ని మించి చర్చించాం. అలాం టప్పుడు గొడవకు ఆస్కారం ఎక్కడిది? మీ సమక్షంలో ఒకటి చెబుతారు.

మళ్లీ ఇక్కడ అరాచకం చేస్తారు. చిన్న చిన్న విషయాలను వదిలేశాం. ఇప్పుడు శాసనమండలి చైర్మన్‌పై దాడి చేశారు. పైగా చైర్మన్‌ నాటకాలాడుతున్నారని అంటారు. ఏం అవసరం? కాంగ్రెస్‌ వాళ్లు ముందే నిర్ణయించుకున్నారు. దీనిపై మాకు సమాచారం ఉంది. సభలో మాకు లాభం లేదు అని బయటికి వెళ్తున్నారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్‌గారి ప్రసంగ సమయంలో మర్యాద పాటిస్తారని అనుకున్నాం. హుందాతనం ఉండాలంటే.. అరుపులు, పెడబొబ్బలు, కళ్లద్దాలు, కాగితాలు.. వీళ్లు సభ హుందాతనం కాపాడరు. అంతిమ నిర్ణేతలు ప్రజలు.

మేం కరెక్టుగా వెళ్తున్నామనే అనుకుంటున్నాం. సభ తీసుకున్న నిర్ణయం సరైన చర్యే అని భావిస్తున్నాం’’అని సీఎం అన్నారు. జానారెడ్డిపై సస్పె న్షన్‌పై బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా సీఎం స్పందించారు. ‘‘జానారెడ్డిని నేనే ఎక్కువ గౌరవించా. పెద్దలు జానారెడ్డి అని సంబోధించా. క్లిప్పింగ్స్‌ చూసి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు అప్పగించాం. సందర్భం దొరికింది కాబట్టి సిద్ధాంతాలేవీ లేకుండా కలసిపోదామంటే మీ ఇష్టం. సభ అంటే మీరేనా? అధికారపక్ష సభ్యులు లేరా? అయినా సభ నిర్ణయం తీసుకున్నది. అయిపోయింది. దీనిపై ఇంకా చర్చ ఎందుకు’’ అని ప్రశ్నించారు.

నిరసన.. హింసకు దారితీయొద్దు: అక్బరుద్దీన్, ఎంఐఎం
చట్టాలను రూపొందించేవారు చట్టసభల గౌరవం కాపాడాలి. అసెంబ్లీలో సోమవారం బ్లాక్‌ డే. సీఎం చెప్పింది కరెక్టు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ నిరసన.. హింసకు దారితీయొద్దు. నిన్న హద్దులు దాటారు. తప్పు చేసి దబాయిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. కాంగ్రెస్‌ సభ్యులపై నిర్ణయం సరైనదే.

అయితే నిర్ణయం తీసుకునేముందు రాజకీయ పార్టీలకు చెబితే బాగుంటుంది. కాంగ్రెస్‌  నిస్పృహ (ప్రస్టేటెడ్‌) పార్టీ. దేశమంతటా ఓడిపోతోంది. అందుకే ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారు. చట్టసభ సభ్యులు రౌడీల్లా వ్యవహరించవద్దు.

జానా సస్పెన్షన్‌ సరికాదు: జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత
గవర్నర్‌ ప్రసంగం సమయం లో జరిగిన సంఘటన దురదృష్టకరం. కాంగ్రెస్‌ సభ్యులను సస్పెం డ్‌ చేసే ముందు మాట్లాడితే బా గుండేది. పార్లమెంటు వ్యవస్థలో ఎవరూ అలా చేయవద్దు. ప్రతిపక్ష నేత జానారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు సరికాదు. నాలుగేళ్లుగా జానారెడ్డి సభలో ఉండే తీరును చూస్తున్నాం.

సోమవారం కూడా ఆయన కుర్చీలో నుంచి లేవలేదు. నినాదాలు చేయలేదు. సభలో సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ముఖ్యమైనవారు. అకారణంగా చర్య తీసుకోవడం దురదృష్టకరం. పార్ల మెంటులో టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్లకార్డులు పెడుతున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా? ఇతర పార్టీల వాదన వినడానికి సిద్ధం గా లేకపోతే ఎలా? ఇంత అసహనమా?

మరిన్ని వార్తలు