యాచించి కాదు.. శాసించి నిధులు తెచ్చుకుందాం!

24 Mar, 2019 01:16 IST|Sakshi

16ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఇది సాధ్యం 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

దేశంలోనే ఉత్తమ సీఎం కేసీఆర్‌ అని ఐఏఎన్‌ఎస్‌ సర్వే చెప్పిందని వెల్లడి 

టీఆర్‌ఎస్‌లో చేరిన పలు జిల్లాల కాంగ్రెస్‌ నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే పార్టీ వారు ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ మేలుజరుగుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేశాం, పార్లమెంటు ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటేస్తామంటే.. నాగలికి ఓ వైపు దున్న పోతు, మరోవైపు ఎద్దును కట్టినట్టు ఉంటుందన్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్రాన్ని యాచిస్తే నిధులు రావని, శాసించి గల్లా పట్టి తెచ్చుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ 16ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఇలా చేయొచ్చన్నారు. బడితే ఉన్నోడిదే బర్రె అన్నట్టు రాజకీయాలు తయారయ్యాయని శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమం లో వ్యాఖ్యానించారు. వరంగల్‌ తూర్పు, తాండూరు, పరిగి, జహీరాబాద్‌ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. వరంగల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మంద వినోద్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు, జహీరాబాద్‌ మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ మంకాల్‌ సుభాష్, ఆరుగురు కౌన్సిలర్లు, పెద్దేముల్‌ జెడ్పీటీసీ స్వరూప మల్లేశ్, తాండూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు కేటీఆర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కొప్పుల మహేశ్‌రెడ్డి, మానిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పి.మహేందర్‌రెడ్డి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరినుద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. 

ఐదేళ్లలోనే దరిద్రం వదులుతుందా? 
‘కేసీఆర్‌ పాలనకు తాజా సర్వే అద్దం పట్టింది. ఐఏఎన్‌ఎస్‌ నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌ దేశంలోనే అత్యుత్తమ సీఎంగా మొదటి ర్యాంక్‌ వచ్చింది. ఉద్యమ నాయకుడికి మంచి పాలనాదక్షుడిగా గుర్తిం పు వచ్చింది. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏం సాధించాయి? దేశంలో కరెంటు, నీళ్లను సైతం జాతీయ పార్టీలు ఇవ్వలేకపోయాయి. నేరం చేసిన వాళ్ళే తప్పు వేరే వాళ్ళ మీద నెట్టి తప్పించుకునే రీతిలో విశ్వేశ్వర్‌రెడ్డి వైఖరి ఉంది. కాంగ్రెస్‌ జాతీయపార్టీ ఎలా అవుతుంది. ఓ పెద్ద సైజు ప్రాంతీయపార్టీ మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు దయతలిస్తేనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ గెలిచేది. పొరపాటున ఆ రెండు పార్టీలు అభ్యర్థులను పెడితే సోనియా, రాహుల్‌ కూడా ఓడిపోతారు. టీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో ఏం చేయలేదని విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ఇన్నేళ్లలో తెలంగాణకు తెచ్చిన దారిద్య్రం ఐదేళ్లలో వదులుతుందా? కాంగ్రెస్‌ నేతలు హిమాలయాల్లో ఆకుపసరు తాగి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 2014లో అచ్చేదిన్‌ అని మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మోదీ గద్దె దిగితేనే అచ్చేదిన్‌ వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.

మోదీ వేడి తగ్గింది. ఇదే మనకు సరైన సమయం. కాంగ్రెస్, బీజేపీలకు కీలెరిగి వాతపెడదాం. కాంగ్రెస్, బీజేపీ కలిసినా అధికారం రాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలకు 150 నుంచి 170 సీట్లు వస్తాయి. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలిచి.. మరింత మంది ఎంపీలను మనతో కలుపుకుంటే ప్రధాని ఎవరనేది హైదరాబాద్‌లో నిర్ణయించవచ్చు. ప్రస్తుత ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేయాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయించే ఎన్నికలు ఇవి. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే యజ్ఞం చేస్తున్నారు. ప్రజలు దీంట్లో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పించాయి. 16ఎంపీ సీట్లను టీఆర్‌ఎస్‌ గెలిస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు రాదు? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో కృష్ణా జలాలు తెచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకాళ్లు కడుగుతాం. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థి అన్నట్టుగా వ్యవహరించి పనిచేయాలి. టీఆర్‌ఎస్‌కు ఓటేయాల్సిన అవసరాన్ని ఒక్కొక్కరు వంద మందికి చెప్పాలి. తాండూరులో మహేందర్‌రెడ్డి ఓడిపోతారని మేం ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో తాండూరు, పరిగిలో టీఆర్‌ఎస్‌కు మంచి మెజారిటీ రావాలి’అని కేటీఆర్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు