మోదీ, రాహుల్‌కు భయం: కేసీఆర్‌

1 Apr, 2019 01:20 IST|Sakshi

మోదీ, రాహుల్‌కు భయం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం

16 సీట్లు ఇవ్వండి..దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాం

ఇకపై దేశ పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే

మోదీ.. నువ్వు రైతుబంధును నకల్‌ కొట్టినవ్‌!

సంక్షేమ పథకాలు ఎట్లుండాల్నో.. తెలంగాణకొచ్చి నేర్చుకో

వసరమైతే జాతీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో మార్పు తెస్తాం

తమపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం మండిపాటు

వనపర్తి, భూత్పూర్‌ బహిరంగ సభల్లో ప్రసంగం    

ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదు. ప్రజలు గెలవాలి. ప్రజల అభిమతం, అభీష్టం గెలవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు పనిచేస్తా. దానికి మీ మద్దతు అద్భుతంగా ఉండాలని కోరుతున్నా. దేశం బాగుపడాలంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలి. న్యాయ, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ విధానంలో మార్పులు జరగాలి. రైతులకు గిట్టుబాటు కావాలి. ఇది కేంద్రం చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ చేయాలనే పట్టుదలతో మేమున్నాం. 16 సీట్లు సాధించి దేశ రాజకీయాలను శాసిస్తాం – కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘నేను ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడితే.. ఢిల్లీ పీఠాలు కదులుతాయని ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలకు భయం పట్టుకుంది. అందుకే అమిత్‌ షా, మోదీ, రాహుల్‌గాంధీ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్రంలో అధికార పార్టీగా, ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్రమోదీ ఏం మాట్లాడుతరు? నువ్వు చేసే అభివృద్ధికి నేను అడ్డుపడ్డనా? నువ్వు ఏం అభివృద్ధి చేసినవ్‌? నేనెక్కడ అడ్డుపడ్డ? వివరాలు బయటపెట్టాలి. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ల దరిద్ర పాలన పోవాలి. అందుకే జనం నన్ను దేశ రాజకీయాల్లోకి వెళ్లమంటున్నరు. అవసరమైతే జాతీయపార్టీ పెడ్తా. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తా. మే23 తర్వాత దేశంలో పాలనాపగ్గాలు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉంటయి’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్లకు సంబంధించి వనపర్తి, భూత్పూర్‌ల్లో నిర్వహించిన బహిరంగసభల్లో సీఎం ప్రసంగించారు.

ఈ సందర్భంగా మూడ్రోజుల క్రితం పాలమూరు సభలో తనపై ప్రధాని చేసిన విమర్శలపై కేసీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘నిన్న నరేంద్రమోదీ గారు ఇక్కడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇప్పుడున్నంత జనంలో 10 శాతం మంది కూడా లేకుండ్రి. ఆయన ఇక్కడ ఏం మాట్లాడతరు? ప్రధానమంత్రి అయ్యుండి అలా మాట్లాడొచ్చా? గ్రామ సర్పంచ్‌ కూడా అట్లా మాట్లాడడు. వేరే వాళ్లను అడిగేముందు మీరు ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నరు కదా మోదీ గారూ.. దేశానికి మీరేం చేశారో చెప్పొచ్చు కదా? ఐదేళ్లు ఇది చేసిన మళ్లీ ఇది చేస్తా అని ఓటర్లకు చెప్పాలి. కానీ ఆయన చేసింది చెప్పకుండా లొల్లిలొల్లి చేస్తారా? బీజేపీ నాయకులను నేను అడుగుతున్న ఈ ఐదేళ్లు మీరు దేశానికి ఏం చేసిండ్రో చెప్పాలి. రైతులు చచ్చిపోయిండ్రు, ఆత్మహత్యలు చేసుకుండ్రు, వలసలు పోయిండ్రు.. 50 ఎకరాలున్న ఇదే పాలమూరు రైతులు.. హైదరాబాద్‌లో కూలీ పని చేసుకున్నరు. అలాంటి బాధలు మనం అనుభవించినం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ దేశంలో రైతుబంధు పథకం ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలి. మీకు ఎందుకు ఆలోచన రాలే. రైతుబీమా ఆలోచన ఎందుకు చేయలే’అని కేసీఆర్‌ విమర్శల వర్షం కురిపించారు.

ఐదేళ్లలో మీరేం చేశారు?
అమిత్‌ షా, నరేంద్రమోదీ, రాహుల్‌ గాంధీ పని కట్టుకునే తనను విమర్శిస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘తెలంగాణలో ఇచ్చే 24గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చారా? నరేంద్రమోదీ.. మీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇస్తున్నవా? 29 రాష్ట్రాలుంటే.. 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశం మొత్తంలోనే పోలీస్‌ శాఖలో పని చేసే హోంగార్డులు, ఐకేపీ, ఆశా వర్కర్లకు ఎక్కువ జీతాలిచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతు చనిపోతే పది రోజుల్లోనే రూ.5లక్షలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25లక్షల విలువ చేసే కార్పొరేట్‌ విద్య అందించేలా 550 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం. మనం తప్ప పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టి ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైన ఉందా? మీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఇవి వాస్తవాలు కావా?’అని సీఎం ప్రశ్నించారు. ‘మీరు రోజూ నరేంద్రమోదీ, రాహుల్‌ గాంధీని చూస్తున్నరు. ఆయన మీద ఈయన.. ఈయన మీద ఆయన విమర్శలు. మైకులు పగిలిపోతున్నయ్‌. మీరిద్దరే కాదా.. దేశాన్ని పాలించింది. ఇంకెవరైనా వేరేవాళ్లు పరిపాలించిండ్రా? వాళ్లే ఇప్పుడు లొల్లి చేస్తుండ్రు.. తొడలు కొడ్తుండ్రు. ఎవరి మీద మీ చాలెంజ్‌లు? మహబూబ్‌నగర్‌ను వలస, కరువు జిల్లాగా చేసిందెవరు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చిందెవరు? కరెంట్‌ ఇవ్వక మోటార్లన్నీ కాలబెట్టి నాశనం చేసిందెవరు? మంచినీళ్లకు అరిగోస పెట్టిందెవరూ? ఇవన్నీ నిజాలు కావా? నేనేమైనా కథలు చెప్తునన్నా. పాలమూరు ప్రజల బతుకులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నయ్‌. కరెంట్‌ 24 గంటలు ఇచ్చుకుంటున్నం.. మోటార్లు కాలుతలేవ్‌.. పొలాలు పచ్చబడుతున్నయ్‌.. పెన్షన్లు మంచిగా ఇచ్చుకుంటున్నం.. కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి మహిళలను కాపాడుకుంటున్నం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

పాలమూరు ఎత్తిపోతలకు నిధులేవీ?
‘పదేళ్ల యూపీఏ ఏమీ చేయని పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు ఇచ్చి.. పూర్తి చేస్తామని 2014లో కేసీఆర్‌ హామీ ఇచ్చిండు. గెలిచిన తర్వాత నిధులివ్వలే. నేను పాలమూరు పథకానికి డబ్బులివ్వమని, కృష్ణ ట్రిబ్యునల్‌ వివాదం తెంపమని 500 ఉత్తరాలు రాసినా.. ఉలుకులేదు పలుకులేదు. ఒక్క రూపాయి ఇవ్వలే. పాలమూరు పథకానికి నిధులు ఇస్తామన్నవ్‌. ప్రధానమంత్రి అయినవ్‌. తర్వాత ఎక్కడ ముసుగేసుకుని పండుకున్నవ్‌? ఎవరు అడ్డం పడ్డరు? పాలమూరుకు డబ్బులిస్తే మేం వద్దన్నమా? మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ చెబితే రూ.24 కూడా ఇవ్వలే. ఇవి వాస్తవాలు కావా? ఈ విషయంలో చర్చకు సిద్ధమా? మహబూబ్‌నగర్‌లో ఏ చౌరస్తా వద్ద వచ్చినా చర్చించేందుకు నేను సిద్ధం’అని సీఎం అన్నారు.

బీజేపీ తప్పుడు ప్రచారం
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఇస్తున్న రూ.1000 పింఛనులో రూ.800 మోదీ.. రూ.200 కేసీఆర్‌ ఇస్తుండని బీజేపీ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘వాస్తవంగా రాష్ట్రంలో 60 ఏళ్లు ఉన్న వయస్సును 57 ఏళ్లకు తగ్గించాం. రాష్ట్రంలో 47,88,070మందికి పెన్షన్లు ఇస్తున్నం. మొన్నటి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.11,843 కోట్లు పింఛన్ల కోసం పెట్టినం. ఇందులో పొత్తు పెట్టుకున్న కేంద్రం 6,66,533మందికి ఏడాదికి రూ.203 కోట్లు మాత్రమే ఇస్తుంది. దీనిపై చర్చకు వస్తారా?’అని బీజేపీ నాయకులను సీఎం డిమాండ్‌ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వీళ్లను ప్రజలే నిలదీయాలన్నారు.

చెప్పినవన్నీ తప్పయితే ఓడించండి
‘ఉద్యమాలు జరిగేటప్పుడు నన్ను ఆగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు. ఎంత నిందించిండ్రు. ఎంత అవమానించిండ్రు. నేను ఆగం కాలే. మీ దీవెనలతో ధైర్యంగా ముందుకెళ్లిన. ఒక్కొక్కరు జమై.. ఉద్యమం ఉప్పెనగా మారి.. రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఇప్పుడిప్పుడే దారిలో పడ్డాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? కరెంట్‌ పరిస్థితి ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? రచయితలు, విజ్ఞానవంతులు, మేధావులు గ్రామాల్లో చర్చ పెట్టండి. ఒకవేళ మేం చెప్పింది తప్పయితే.. డిపాజిట్‌ రాకుండా మమ్మల్ని ఓడించండి. నిజమే అయితే.. ఎదుటివాళ్లకు డిపాజిట్‌ రాకుండా చేయండి. ప్రజలు నిజాయితీ వైపుండాలి. అప్పుడే మీకు లాభం జరుగుతది’అని కేసీఆర్‌ అన్నారు.

ఎజెండాను మరిచి!
దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఎజెండాను వదిలి నా వ్యక్తిగతంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో జ్యోతిష్యుడి సలహా మేరకు పాలన ఉంటుందని విమర్శించిన మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాకు జ్యోతిష్యుడిపై నమ్మకం ఉంటే ఏందీ లేకపోతే నీకేంది?’అని ప్రశ్నించారు. రైతులు, నీళ్లు, కరెంటు, సంక్షేమంపై వంటి ఎజెండాపై మాట్లాడాలని సూచించారు. మీరు రాజకీయ హిందువులు, మీరు సూడో హిందువులు, ప్రజా సమస్యలపై మాట్లాడాలి. దేశ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే సర్జికల్‌ దాడులను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను కేటాయించాలని వేడుకున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జపాన్, అమెరికా, చైనా లాగా భారత్‌ మారొద్దా? అని సీఎం ప్రశ్నించారు.

తెలంగాణలో అమలవుతున్న మిషన్‌ భగీరథ, 24 గంటల విద్యుత్, పింఛన్ల అమలుపై ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చి అధ్యయనం చేస్తున్నారని కేసీఆర్‌ చెప్పారు. ‘మోదీ నువ్వు.. ఇక్కడికి వచ్చి తెలంగాణలో అమలవుతోన్న పథకాలను నేర్చుకొని పోవాలి. రైతుబంధును బీజేపీ నఖలు చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో 3వేల మంది ఎస్టీలకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దే’అని ఆయన అన్నారు. ‘పాలమూరు–కాళేశ్వరానికి రూ.30వేల కోట్లు మంజూరైంది. రెండున్నరేళ్లలో మహబూబ్‌నగర్‌లో 20 లక్షల ఎకరాలకు నీరు పారిస్తా. పాలమూరులో పసిడి పంటలు పండాలి. నేను రైతు గొంతుక’అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇండియా అంతా ఇక్క డికే వచ్చి నేర్చుకునేలా జూలైలోగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామన్నారు. అందుకు త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేస్తున్నామన్నారు.

14 స్థానాల్లో డిపాజిట్లు రావు  
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని సీఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఎన్నికల తర్వాత భరతం పడ్తమంటున్నడు. నా జీవితం తెరిచిన పుస్తకం. క్రమం తప్పకుండా ఇన్‌కం ట్యాక్స్‌ దాఖలు చేస్తా. పాలమూరు గడ్డ మీది చెప్తున్న, మే 23 తర్వాత మీ భరతం మేం పడ్తాం. మీ కథ అయిపోయింది. బీజేపీ 150సీట్లలోపు.. కాంగ్రెస్‌ వందలోపే ఇద్దరు కలిసినా అధికారంలోకి రారు. దేశంలో ప్రాంతీయ కూటములదే హవా నడుస్తున్నది’అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మరిన్ని వార్తలు