తెలంగాణలో కేసీఆర్‌ అవినీతి పాలన

22 Oct, 2018 02:09 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రాంమాధవ్‌

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ 

హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ అవినీతి పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆరోపించారు. ఆదివారం మల్కాజిగిరిలో బీజేపీ మల్కాజిగిరి అసెంబ్లీ కన్వీనర్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని మండిపడ్డారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. తన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లకుండా ఇంటి నుంచే పాలన చేసిన కేసీఆర్‌కు ప్రజల కష్టాల గురించి ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎంఐఎంతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కేసీఆర్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని అన్నారు.

బీజేపీ మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. అది తెలుగుదేశం పార్టీ కాదని తెలుగు ద్రోహుల పార్టీ అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 50 సీట్లు రావడం కష్టమేనని, రాష్ట్రంలో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థిగా నిలబడుతున్న ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావును గెలిపించాలని కోరారు. అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మల్కాజిగిరిలో తక్కువ ఓట్లతో ఓడినప్పటికీ తాను ఇక్కడి ప్రజలకు అండగా ఉన్నానన్నారు. అనంతరం కార్యకర్తలు భారీ గజమాలతో రాంమాధవ్, రాంచందర్‌రావులను సన్మానించి ఖడ్గాన్ని బహూకరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకు ల విజయ, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు