-

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌.. కవిత ఓటమి

23 May, 2019 15:25 IST|Sakshi

నిజామాబాద్‌ స్థానంలో ఓటమి చెందిన కవిత

బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ సంచలన విజయం

హైదరాబాద్‌: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఫుల్‌జోష్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాక్‌ ఇచ్చాయి. సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు అంటూ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆ పార్టీకి  ఊహించనిరీతిలో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయురాలైన కవిత నిజామాబాద్‌ స్థానంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో 68 వేలపై చీలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలైయ్యారు.

ఇక, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన బీ. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ చేతిలో ఓటమిని చవిచూశారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్‌ అంటే సెంటిమెంట్‌. ఉద్యమకాలంలో ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ రికార్డు మెజారిటీతో గెలుపొందారు. కరీంనగర్‌లో ఓటమి కూడా టీఆర్‌ఎస్‌ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ గోడెం నగేశ్‌పై భారీ మెజారిటీతో లీడింగ్‌లో ఉన్నారు. 

ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ.. బీజేపీ తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుపొందడం గమనార్హం. నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లాంటి టీఆర్‌ఎస్‌ కంచుకోటలను బద్దలు కొట్టడమే కాదు.. సికింద్రాబాద్‌లో సైతం బీజేపీ గెలుపుదిశగా సాగుతోంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం కిషన్‌రెడ్డి 30వేల పైచిలుకు ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌పై ఆధిక్యంలో ఉన్నారు. ఇదేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా తెలంగాణలో నాలుగు స్థానాలు కైవసం చేసుకునే దిశగా సాగుతుండటం గమనార్హం. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి విజయం సాధించగా.. చెవేళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపొందారు.

మరిన్ని వార్తలు