మాట తప్పిన వ్యక్తి సీఎంగా అనర్హుడు

18 Jun, 2018 09:13 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్‌ చంద్రకుమార్‌   

సుందరయ్యవిజ్ఞానకేంద్రం : తమ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీశైలం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని, మాట తప్పిన వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెక్కులను అందచేశారు. సభలో జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. జీఓలు 98, 67లను అనుసరించి నిర్వాసిత ప్రతి కుటుంబానికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, పునరావాసం కింద రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించలేదన్నారు. కార్పొరేట్‌ విద్యను అరికడతామని, విద్య, వైద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు సంక్షేమ పథకాలను అందచేయాలన్నారు.

భూమిలేని దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రభాకరాచారి, తెలంగాణ ప్రజల పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాంబశివగౌడ్, సదరా బేగం, సుతారి లచ్చన్న, ఎడవెల్లి మోహన్, వేద వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు