శాసనసభ రద్దు

7 Sep, 2018 01:22 IST|Sakshi

షెడ్యూల్‌కు 8 నెలల 26 రోజుల ముందే రద్దయిన అసెంబ్లీ

మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం అధ్యక్షతన కేబినెట్‌ భేటీ 

అసెంబ్లీని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ ఏకవాక్య తీర్మానం

మధ్యాహ్నం 1:14 గంటలకు ముఖ్యమంత్రి చేతికి తీర్మానం కాపీ 

1:23 ప్రగతి భవన్‌ నుంచి రాజ్‌భవన్‌కు సీఎం

1:28 నరసింహన్‌కు తీర్మానం అందజేత

సీఎం సమక్షంలోనే సభను రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ 

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌కు సూచన 

తర్వాత కాసేపటికే శాసనసభ రద్దయినట్లు గెజిట్‌ జారీ 

కేంద్ర హోంశాఖకు గవర్నర్‌ సమాచారం.. ఆపై ఈసీకి వర్తమానం

కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు సీఎం కేసీఆర్‌ తెరదించారు. అసెంబ్లీ రద్దు లాంఛనంగా ముగియడంతో ముందస్తు ఎన్నికలకు తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పగ్గాలు చేపట్టిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే రద్దయింది. కేబినెట్‌ తీర్మానానికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలపడం.. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ కాలం ముగిసినట్లైంది. నగరంలో గురువారం అంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన, అసెంబ్లీ రద్దు హడావుడే కనిపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలతోపాటే తెలంగాణకు నవంబర్‌ 20 తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ జారీ కావొచ్చని, డిసెంబర్‌ ఆఖరి వారంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలున్నట్లు అంచనా.

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తొలి అడుగు పడింది. అసెంబ్లీ రద్దు లాంఛనం ముగిసింది. తెలంగాణ తొలి శాసనసభ ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే గురువారం రద్దయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 174 క్లాజ్‌ 2 (బీ)ని అనుసరించి శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ తరువాత శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు గవర్నర్‌ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్లైంది. 

అంతా అనుకున్నట్లుగానే... 
మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ రద్దు చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానం చేసింది. మంత్రులంతా ప్రగతి భవన్‌కు వచ్చిన వెంటనే సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) అధికారులు మంత్రలకు ఎజెండా కాపీలతోపాటు శాసనసభ రద్దు తీర్మానం కాపీని చూపారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి సంతకం చేయగా తరువాత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతకాలు చేశారు. మిగిలిన వారు వరుస క్రమంలో ఈ తతంగాన్ని పూర్తి చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 1:14 గంటలకు తీర్మానం కాపీ ముఖ్యమంత్రి చేతికి అందింది. (చదవండి: మళ్లీ నేనే సీఎం)

సభ రద్దుపై కాసేపు మంత్రులతో సంభాషించిన కేసీఆర్‌ మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రాజ్‌ భవన్‌ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 1:28 గంటలకు రాజభవన్‌ చేరుకొని మంత్రివర్గం చేసిన సభ రద్దు సిఫారసు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 30 నిమిషాలు గవర్నర్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో ఉండగానే శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో శాసనసభను రద్దు చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ పదవిలో కొనసాగాలని కేసీఆర్‌కు సూచించారు. ఆ తరువాత కొద్దిసేపటికే కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి ఉత్తర్వులు జారీ చేశారు. 

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ... 
శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ వెలువరించిన కాసేపటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్‌ కాపీని ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ను కలసి అందించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సమాచారం కేంద్ర హోంశాఖ నుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, శాసనసభ రద్దు విషయాన్ని సీఈవో లాంఛనంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసినా అది కమ్యూనికేషన్‌ కిందకే వస్తుందని ఎన్నికల వర్గాలు చెప్పాయి. 

కేంద్ర హోంశాఖకు చేరనున్న గెజిట్‌ నోటిఫికేషన్‌
రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గవర్నర్‌ ద్వారా రాష్ట్రాలకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించే కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చేరుతుంది. అక్కడి నుంచి తెలంగాణ శాసనసభ రద్దయిన దృష్ట్యా తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ హోంశాఖ కార్యదర్శి ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. ఈ ప్రక్రియ ముగియడానికి 2–3 రోజులు పడుతుందని, వచ్చే సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ రద్దుపై ప్రకటన వెలువరిస్తుందని అధికార వర్గాలు తెలియజేశాయి.

నవంబర్‌ ఆఖరులో ఎన్నికల షెడ్యూల్‌
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం ఎన్నికలతోపాటే తెలంగాణకు నవంబర్‌ నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేందుకు అవకాశాలు ఉన్నాయి. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి 40 రోజుల మందు షెడ్యూల్‌ వెలువడుతుంది. పోలింగ్‌కు మూడు వారాల ముందు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఆ నాలుగు రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి జనవరి మొదటి వారంతో పూర్తవుతుంది. అంటే డిసెంబర్‌ ఆఖరు వారంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే నవంబర్‌ 20 తరువాత ఎప్పుడైనా ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

గన్‌పార్కుకు వెళ్లకుండానే 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ లభించగా ఆ మేరకే సీఎం కాన్వాయ్‌ సరిగ్గా 1:28 గంటలకు గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ చేరుకుంది. అరగంట తరువాత.. అంటే మధ్యాహ్నం 2:02 గంటలకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ బయటకు వచ్చింది. అయితే అసెంబ్లీ రద్దుకు గవర్నర్‌ ఆమోదం తెలిపాక కేసీఆర్‌ నేరుగా గన్‌పార్కుకు చేరుకుంటారని, అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొంటారని ప్రచారం సాగింది. కానీ సీఎం కాన్వాయ్‌ గవర్నర్‌ నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకుంది. దీంతో మీడియా ప్రతినిధులు అప్రమత్తమై ఆయన వాహన శ్రేణిని అనుసరించారు. అయితే ఈ మార్పునకు కారణం తెలియరాలేదు.

మరిన్ని వార్తలు