సభపై ‘గులాబీ’  నజర్‌!

17 Oct, 2019 09:57 IST|Sakshi
సిద్ధమైన సభావేదిక

నేడు హుజూర్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

చివరి అంకానికి ఉప ఎన్నిక ప్రచారం

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలింది. ప్రచారం చివరి అంకానికి చేరడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. గురువారం హుజూర్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌ వస్తుండడంతో టీఆర్‌ఎస్‌ భారీగా జన సమీకరణ చేస్తోంది. వారం రోజు లుగా ఈ సభపైనే టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు బుధవారం సాయంత్రం పరిశీలించారు.

సీఎం కేసీఆర్‌ వస్తారని ..
మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా హుజూర్‌నగర్‌ చేరుకుంటారు. పట్టణ సమీపంలో రామస్వామిగుట్టకు వెళ్లే దారిలో సభాస్థలి పక్కనే హెలిపాడ్‌ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటలకు సభ ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ సభలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పొల్గొననున్నారు. ఉప ఎన్నికల ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డిలు సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ముఖ్య నేతలతో జనసమీకరణపై పలుమార్లు సమీక్షించారు.

ఇతర జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పార్టీ ప్రచార ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్నారు. వీరంతా ఆయా మండలాల కేడర్‌తో సభకు భారీగా తరలిరానున్నారు. సాధారణ ఎన్నికల్లో ఇక్కడే సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. అప్పుడు, ఇప్పుడు శానంపూడి అభ్యర్థిగా ఉన్నారు. సభలో ముఖ్యమంత్రి చేసే ప్రసంగంపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

నియోజకవర్గంలో రోడ్లు, కొన్ని చోట్ల ఎత్తిపోతలు, ఇళ్ల నిర్మాణంతో పాటు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలన్న డిమాండ్లపై సీఎం హామీల ఇస్తారని పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సభతో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ ఇప్పటికే అంచనా వేసింది. అయితే సీఎం ప్రసంగం ఎలా ఉంటుందోనని ఆ పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీల నేతల ఎదురుచూస్తున్నారు. 

హుజుర్‌నగర్‌లో రణగోల..
ఉప ఎన్నికల ప్రచార గడువు మూడు రోజులే ఉండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రచారంతో హుజూర్‌నగర్‌ రాజకీయ రణగోలగా మారింది. ఎక్కడ చూసినా ఉదయం నుంచే ‘పలానా పార్టీ అభ్యర్థి గుర్తుకే ఓటేయాలి’ అన్న మైకుల మోత మోగుతోంది. పల్లెలు, పట్టణాల్లో ఆటోలు, ట్రాలీలు, డీసీఎంలల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి ప్రచారాన్ని కదం తొక్కిస్తున్నారు. ఎవరో తెలవని నేతలు, ఎప్పుడు రాని విధంగా గడపగడపకూ వచ్చి తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లను అభ్యరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇతర జిల్లాల నుంచి నేతలు, రాష్ట్ర ముఖ్య నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను రప్పించి ప్రచారం చేయిస్తున్నారు. దీంతో ఈ స్థాయిలో ఏ ఎన్నికకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రచారం జరగలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నిక కావడంతో ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్‌కు ఇక్కడ విజయం ప్రతిష్టాత్మకంగా మారింది.

అలాగే తమ సత్తాఏంటో నిరూపించుకోవాలని బీజేపీ కూడా ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుంది. ఈ పరిస్థితితో చివరి మూడు రోజులు ముఖ్య నేతల ప్రచారంతో ప్రజాభిప్రాయం ఏమేరకు మారుతుంది ..?, ఏ పార్టీ వైపు కొంత మొగ్గుచూపే అవకాశం ఉందన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా