నేడు మంత్రివర్గం అత్యవసర భేటీ

22 Aug, 2018 01:18 IST|Sakshi

మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి భోజనం

సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం

ఎన్నికల సన్నద్ధానికి వ్యూహరచన కోసమేనా? 

ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగుల్లో మార్పులు?

శాసనసభ రద్దు ఉండబోదన్న సీఎం సన్నిహితులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులందరూ బుధవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనానికి రావాలని సీఎం కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఆదేశాలు వెళ్లాయి. మధ్యాహ్నం మంత్రులతో కలసి సీఎం భోజనం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు వారితో సమావేశమవుతారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో మంత్రులతో సీఎం భేటీపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని, సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో సమావేశంపై శ్రేణుల్లో పలు రకాల ఊహాగానాలున్నాయి. అయితే శాసనసభ రద్దు వంటి తీవ్ర నిర్ణయాలేమీ ఉండవని, ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితులేమీ లేవని సీఎం సన్నిహితులు స్పష్టంగా చెబుతున్నారు. రాజకీయ అంశాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై భేటీలో లోతుగా చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు. 

ప్రగతి నివేదన సభ, ఎన్నికలపై.. 
కొంగర కలాన్‌ ప్రాంతంలో సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు 10 రోజులే గడువు ఉన్నందున అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో చర్చించే అవకాశముందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. సభ నిర్వహించడం సాధ్యమా, నిర్వహించాల్సి వస్తే ఏర్పాట్లు, బాధ్యతలు, పని విభజన, వీలు కాకుంటే వాయిదా నిర్ణయంపైనా ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వస్తే మంచిదా, విడివిడిగా వస్తే టీఆర్‌ఎస్‌కు లాభమా, లోక్‌సభతో పాటు జరిగితే ప్రయోజనమా, వాటి కోసం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రుల అభిప్రాయాలు అడగనున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండటానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ జరగనుంది. 

అధికారులతో ఎన్నికల టీంపై..
రాష్ట్ర స్థాయిలో పలు శాఖల హెచ్‌వోడీల నియామకాలు, మార్పులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టింగులు, కలెక్టర్లు, ఎస్పీలు, డీసీపీలకు స్థానచలనం జరిగే అవకాశముందని తెలుస్తోంది. అధికారులతో ఎన్నికల టీమ్‌ సిద్ధం చేసుకోడానికి జిల్లాల వారీగా మంత్రుల అభిప్రాయాలు సీఎం అడగనున్నారని సమాచారం. అలాగే చాలా కాలంగా పెండింగులో ఉన్న ఉద్యోగుల పీఆర్‌ఎసీపై అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చ జరగనుంది. ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ల డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు, మార్కెట్‌ కమిటీల భర్తీపైనా మంత్రుల ప్రతిపాదనలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. మంత్రులు, ప్రముఖులకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు, రాష్ట్రాభివృద్ధి నిధులపై చర్చించే అవకాశముంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల పొత్తులు, కాంగ్రెస్‌తో టీడీపీ చెలిమి, ప్రభుత్వ పథకాలు, అమలు తీరు, ప్రజల అభిప్రాయంపైనా మంత్రుల అభిప్రాయాలు సీఎం అడిగి తెలుసుకోనున్నారు. 

మరిన్ని వార్తలు