కాంగ్రెస్‌వి ఆపద మొక్కులు

30 May, 2018 04:13 IST|Sakshi

ఓట్ల కోసం అమలుకాని హామీలిస్తోంది: కేసీఆర్‌

రూ. 2 లక్షల రుణమాఫీ సాధ్యం కానే కాదు..

రైతులు అప్పులపాలు కావొద్దనే పెట్టుబడి సాయం అందించాం

నవంబర్‌లో రెండో విడత సాయం అందజేస్తాం

సాక్షి, హైదరాబాద్‌ : రైతులు అప్పుల పాలు కాకూడదనే ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తోందని, ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కుతున్నారని, రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు తాము చెప్పిన ప్రతీ పనీ చేశామని, రైతుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు ద్వారా రెండో విడత పంట పెట్టుబడి సాయాన్ని నవంబర్‌లో అందజేస్తామని ప్రకటించారు. మంగళవారం ‘రైతుబంధు’ పథకంపై సీఎం ప్రగతిభవన్‌లో రైతు సమన్వయ సమితి జిల్లా కో–ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలులో రైతు సమస్వయ సమితి కీలకపాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు.

‘‘తెలంగాణలో రైతులు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికేవారు. మంచి వ్యవసాయం సాగేది. రైతులే ఇతరులకు దానాలు చేసే స్థితిలో ఉండేవారు. కానీ రానురాను పరిస్థితి మారింది. సమైక్య రాష్ట్రంలో అవలంబించిన విధానాలతో వ్యవసాయ రంగం దెబ్బతింది. రైతులు అన్ని విధాలా నష్టపోయారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రుణమాఫీ చేసుకున్నాం. కరెంటు బాధ పోయింది. నీళ్ల  బాధ పోతంది. పెట్టుబడి ఎట్ల అనే రంధి లేదు. ఇక కావాల్సింది గిట్టుబాటు ధర. అందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దుక్కి దున్నిన దగ్గర్నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతి దశలో రైతులకు ఏం కావాలో ప్రభుత్వం ఆ పని చేస్తుంది. దానికి అనుగుణంగా రైతులను సమన్వయ పరిచే బాధ్యత రైతు సమన్వయ సమితులు చేపట్టాలి. ఇజ్రాయెల్‌ దేశంలో లాభదాయక వ్యవసాయం సాగుతోంది. అక్కడ ఉత్పత్తి, ఉత్పాదకత ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు పాటించి, అత్యధిక దిగుబడులు పొందుతున్నారు. రైతు సమన్వయ సమితుల జిల్లా కో–ఆర్డినేటర్లు ఇజ్రాయిల్‌ సందర్శించాలి. అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి నేర్చుకుని రావాలి. ప్రభుత్వమే ఖర్చు భరించి ఇజ్రాయిల్‌ పర్యటన ఏర్పాటు చేస్తుంది’’ అని సీఎం  చెప్పారు.

కాంగ్రెస్‌ది అమలు కాని హామీ
ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందని, ప్రజలు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు అన్ని విధాలా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.10,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలు లాంటి తప్పనిసరి ఖర్చులుంటాయి. మిగిలిన రూ.2,500 కోట్లతోనే ప్రభుత్వం చేసే పనులకు ఖర్చు పెట్టే అవకాశముంది. కాంగ్రెస్‌ చెప్పినట్లు రుణమాఫీ చేయాలంటే, ఉద్యోగులకు జీతాలివ్వకుండా ఆపేసినా 20 నెలల సమయం పడుతుంది. జీతాలు, అప్పు కిస్తీలు కట్టకుండా అంతకాలం ప్రభుత్వాన్ని నడపడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్‌ ఎలాంటి హామీలిస్తుందో ప్రజలే అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

జూన్‌ 20లోగా చెక్కులు, బుక్కుల పంపిణీ
జూన్‌ 20 లోగా కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, మార్పు చేర్పులు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు త్వరలోనే ఒక విధానం రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలని సీఎం కోరారు. దాతలు విరాళలమిచ్చిన స్థలాల్లో వేదికలు నిర్మించాలని, మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాలని చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఇచ్చిన చెక్కులను కొంతమంది రైతులు తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నారని, ఆ డబ్బులను రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేయాలని చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్, వినోద్‌ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, వివిధ జిల్లాల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కో–ఆర్డినేటర్లకు సీఎం చేసిన సూచనలివీ..

  • రైతులంతా ఒకే రకం పంట వేసి నష్టపోవద్దు. డిమాండ్‌కు తగినట్లు పంటలు పండించేలా రైతులకు అవగాహన కలిగించాలి. నేల స్వభావం, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి పంటలు పండించాలి. తెలంగాణలో పండించే ప్రతి గింజకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఈ విషయాన్ని రైతులకు విడమరిచి చెప్పాలి. ప్రజల డిమాండ్‌ను తెలుసుకొని దాని ప్రకారం పంటలు పండించాలి.
  • నగరాలు, పట్టణాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో కూరగాయలు ఎక్కువగా పండించాలి. అన్ని ప్రాంతాల ప్రజలు మన రైతులు పండించిన కూరగాయలే తినాలి. అది అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకం, ఆరోగ్యకరం. 
  • రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. వాతావరణం, నేల స్వభావం, గాలి వేగం, వర్షపాతం, ఉష్ణోగ్రతల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ భూములను క్రాప్‌ కాలనీలుగా విభజిస్తారు. ఏ కాలనీలో ఏ పంట వేయాలనే విషయంలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు చేస్తారు. వాటికి అనుగుణంగా పంటలు వేసుకునేలా  రైతులకు చైతన్యం కలిగించాలి.
  • మార్కెట్‌కు క్రమ పద్ధతిలో పంటలు తేవాలి. అందరూ ఒకేసారి తమ ఉత్పత్తులు తేవొద్దు. ఏ గ్రామం రైతులు ఎప్పుడు మార్కెట్‌కు సరుకులు తేవాలో ముందుగానే నిర్ణయించాలి. 
  • ఉత్పాదకత పెంచే నైపుణ్యం రైతులకు కలిగించాలి. జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇజ్రాయిల్‌ వెళ్లి వ్యవసాయ విధానాలు అధ్యయనం చేసి రావాలి. అక్కడ తెలుసుకున్న విషయాలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చెప్పాలి.
  • సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మూడేళ్లలో తెలంగాణలో మార్పు కనిపిస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులను వివరించడానికి, పరస్పరం చర్చించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2500 రైతు వేదికలు నిర్మిస్తున్నాం. ఈ వేదికలను రైతులు ఉపయోగించుకునేలా చూడాలి.
  • రాష్ట్రంలో రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా చేస్తున్నాం. సహజ మరణమైనా సరే బీమా అందుతుంది. 15వ ఆగస్టు నుంచి ఎల్‌ఐసీ బీమా సర్టిఫికెట్లను రైతులకు అందించాలి.
  • మరణించిన రైతు పేరిట ఉన్న భూమి ఎవరి పేరు మీదికి బదిలీ అవుతుందో.. బీమా పాలసీ కూడా ఆ రైతు పేరిట బదిలీ అవుతుంది. అలా బదిలీ చేసే బాధ్యతను రైతు సమన్వయ సమితులు స్వీకరించాలి.
  • గ్రామాల్లో నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని అధికారులకు పట్టివ్వాలి.


పోచారం లక్ష్మీపుత్రుడు: కేసీఆర్‌
పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో వ్యవసాయానుకూల నిర్ణయాలు జరుగుతున్నాయని, రైతు సంక్షేమానికి అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీనివాస్‌రెడ్డి లక్షీపుత్రుడని, అందుకే వ్యవసాయానికి అంతా మంచి జరుగుతోందని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలోని రైతులు దేశంలోనే ధనిక రైతులుగా మారుతారని తనకు నమ్మకం ఉందని చెప్పారు.  

మరిన్ని వార్తలు