అవును.. ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

21 Jan, 2019 02:22 IST|Sakshi

గండ్ర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

‘మీ గవర్నర్‌’ అని గండ్ర అనడంతో ‘మన గవర్నర్‌’ అనాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు ఆదివారం సమావేశమైన శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కాంగ్రెస్‌ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య కాస్తంత వాడీ వేడీ చర్చ జరిగింది. గండ్ర మాట్లాడుతున్నప్పుడు ‘మీ గవర్నర్‌’అని సంబోధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని ‘మన గవర్నర్‌’అనాలని సూచించారు. టీఆర్‌ఎస్‌కు ఒక గవర్నర్, కాంగ్రెస్‌కు మరో గవర్నర్‌ ఉండరని వ్యాఖ్యానించారు. కాబట్టి గండ్ర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. దీనికి కొనసాగింపుగా గండ్ర మాట్లాడుతూ.. అలాగైతే గవర్నర్‌ ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం’పోరాడుతుందని అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అని చదవకుండా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ఎలా అన్నారని ప్రశ్నించారు. దీన్ని కూడా రికార్డుల నుంచి తొలగించాలని గండ్ర డిమాండ్‌ చేశారు. వెంటనే సీఎం జోక్యం చేసుకొని గండ్రపై మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి గవర్నర్‌ అలాగే చదివారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌నే గెలిపిం చాక ఇందులో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఎందుకంత అసహనమని నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు కదా అని అన్నా రు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమనే రాస్తాం. అలా రాయడమే కరెక్ట్‌’అని ముఖ్యమంత్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనిపై గండ్ర స్పందిస్తూ.. సీఎం వ్యాఖ్య లపై తాను వాదనకు దిగదల్చుకోలేదని, ఇక ఆ విషయంపై చర్చను కొనసాగించాలనుకోవడం లేదని గవర్నర్‌ ప్రసంగంపై మాట్లాడారు.  

మరిన్ని వార్తలు