Advertisement

120 గెలుస్తం

26 Jan, 2020 01:59 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఇప్పటికే వందకు పైగా పురపాలికలు గెలిచాం

ఎక్స్‌అఫీషియో ఓట్లతో మిగతా స్థానాల్లో విజయం

అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడతం?

అన్ని చోట్లకు పోయి రిగ్గింగ్‌ చేస్తమా..?

అవాకులు చవాకులు పేలిన విపక్షాలు

వారి పిచ్చికూతలు పట్టించుకోవద్దని ప్రజలు సందేశమిచ్చారన్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ‘మేం 100 పైగా పురపాలికలు గెలిచినం. ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఈ సంఖ్య 115 నుంచి 120 వరకు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ వాళ్లు  తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (ఎక్స్‌అఫీషియో) ఓట్లు వేసే అవకాశముంది. దీంతో 115 నుంచి 120 పురపాలికలు గెలిచే ఆస్కారం ఉంది. అన్ని చోట్లా పోయి మేం రిగ్గింగ్‌ చేస్తమా? అన్ని చోట్లా వెళ్లి మేము దొంగ ఓట్లు వేస్తమా? ప్రతి చోటా మేం కుమ్మక్కయితమా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న చోట్లలో కూడా చాలా చోట్ల గెలిచినం.. మా ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్లలో ఒకటీఅరా ఓడిపోయినం కదా? దాన్నేం అంటరు’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శనివారం ఆయన తెలంగాణభవన్‌లో పార్టీ నేతలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. 

ఈ వేవ్‌ ఎప్పుడూ చూడలేదు.. 
‘ఆ అవాకులు చవాకులు మానేసి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. ఫలితాలొచ్చాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యం విలువ కోల్పోతుంది. వీళ్ల పిచ్చికూతలేవీ పట్టించుకోవద్దని ప్రజలు మాకు సందేశమిచ్చిన్రు. కాబట్టి వీ డొంట్‌ స్టాప్‌ అవర్‌ మిషన్‌. నా అనుభవంలో చాలా వేవ్‌లు చూసిన. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ వేవ్‌ చూసిన. ఈ వేవ్‌ నేనెప్పుడూ చూడలేదు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీరాజ్‌ ఎన్నికలు కావొచ్చు.. ఏడాది తర్వాత జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలు కావచ్చు.. ఇంత స్థిరమైన వేవ్‌ ఒకపార్టీ పట్ల, ఒక నాయకత్వం పట్ల కొనసాగడం సాధారణ విషయం కాదు. ఈ విజయాన్ని శిరోధార్యంగా తీసుకుంటం. గుండెల్లో పెట్టుకుంటం. మా కర్తవ్యాన్ని, బాధ్యతను ఈ విజయం మరింత పెచింది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు గర్వం, అహంకారం రావొద్దు’అని పేర్కొన్నారు.  

మా విధానాలు నచ్చాయి.. 
‘మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఈ జిల్లా.. ఆ జిల్లా అనే తారతమ్యం లేకుండా 360 డిగ్రీల్లో ఒకే విధమైన ఫలితాన్ని ఇచ్చారు. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాలపై అనేక చర్చోపచర్చలు, వాదోపవాదాల తర్వాత అద్భుతంగా బలపర్చారు. మాపట్ల వారి విశ్వాసాన్ని తెలిపారు. ఇతరులు ఏమీ మాట్లాడినా పట్టించుకోకండి.. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం వైపు కొనసాగండని వారు మమ్మల్ని ఆదేశిచ్చినట్లు భావిస్తునాం. మేం అవలంభించే 100 శాతంలౌకికవాద విధానం, అన్ని మతాలు, కులాల పట్ల సమాదరణ, అందరినీ కలుపుకొని పోయే పద్ధతి ప్రజలకు బాగా నచ్చిందని ఈ ఫలితాలు సందేశమిచ్చాయి. ఈ రోజు ఇంత బలమైన తీర్పునిచ్చి వెన్నుతట్టి మమ్మల్ని ముందుకు నడుపుతున్న తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా నా పక్షాన, పార్టీ తరఫున శిరస్సు వంచి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నా. గెలిచిన విజేతలందరికీ అభినందలు. గెలుపు కోసం అహోరాత్రులు పనిచేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు. గెలుపు కోసం తమ ప్రాంతంలోనైనా, ఇతర ప్రాంతానికైన వెళ్లి అద్భుతంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి పార్టీ నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌కు నా ఆశీస్సులు’అని కేసీఆర్‌ చెప్పారు. 

ఇది అసాధారణ విజయం.. 
‘డిసెంబర్‌లో నేను శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అనేక అనుమానాలు వెలిబుచ్చారు. కానీ, కరాంఖండిగా 93 నుంచి 102 స్థానాలు గెలుస్తామని చెప్పినం. 88 సీట్లను గెలవడం అద్భుతమైన సంకేతం. ఇటీవల గెచిన హుజూర్‌నగర్‌తో కలిపి సొంతంగా 89 స్థానాలు గెలుచుకున్నం. శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా మాకు మెజారిటీ స్థానాలొచ్చినయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 32కి 32 జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం భారతదేశ చరిత్రలో ప్రథమం. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలను ఆపాలని విశ్వప్రయత్నం చేసిన్రు. ఎన్నికల ప్రక్రియ ముగిస్తే పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రజలిచ్చిన సమయాన్ని వినియోగించుకోవచ్చని మేమనుకుంటే.. అనేక రకాలుగా కోర్టుల చుట్టూ తిప్పి ఎన్నికలు జరగకుండా చేయాలని చూసిన్రు.

అన్ని అవాంతరాల తర్వాత ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం ముక్తకంఠంతో అద్భుత తీర్పు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో విభిన్న సమూహాల ఓటర్లుంటారు. సాధారణంగా ఇలాంటి ఫలితాలు రావు. చాలా కష్టంతో కూడిన పని. నాకున్న 40–45 ఏళ్ల అనుభవంలో దాదాపు అనేక మున్సిపల్‌ ఎన్నికలను నేను చూసిన. 1994లో అన్నగారు రామారావుతో పాటు నేను టీడీపీలో పనిచేస్తున్న. మధ్య నిషేధం ప్రకటిస్తే ప్రజలు మమ్మల్ని బ్రహ్మండంగా గెలిపించిన్రు. మద్య నిషేధంతో ప్రభుత్వంపై రూ.వేల కోట్ల భారం పడింది. విధి లేక సేల్స్‌ ట్యాక్స్‌ పెంచాల్సి వచ్చింది. ఆ వెంటనే ఎన్నికలు పెడితే ట్యాక్స్‌ పెంచారనే కోపంతో ప్రజలు మమ్మల్ని ఓడగొట్టారు. రాజీవ్‌ గాంధీ మరణించినప్పుడు కూడా నేను అప్పుడు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మున్సిపాలిటీలో మెజారిటీ సంపాదించుకున్న. కానీ, పన్నులు పెంచినప్పుడు 5 వేల మెజారిటీతో మున్సిపాలిటీ ఓడిపోయిన’అని కేసీఆర్‌ వివరించారు. 

ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే మళ్లీ శిక్షిస్తరు.. 
‘టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం అని.. ప్రజలు నవ్వుతరనే సిగ్గు లేకుండా నిన్నమొన్న కొందరు మాట్లాడిన్రు. నేనైతే ప్రచారినికీ పోలేదు. మంత్రులూ ఎవరి జిల్లాలకు వారు పరిమితమైన్రు. మున్సిపల్‌ మినిస్టర్‌ కేటీఆర్‌ కూడా ఎక్కడికీ వెళ్లలేదు. నేను నిజాయతీగా చెబుతున్న.. మొదటి నుంచి ఒక క్రమశిక్షణలో బతికినోళ్లం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా నేను ప్రగతి భవన్‌లోని నా కార్యాలయానికి కూడా వెళ్లలేదు. ఒక్క జిల్లా కలెక్టర్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడలేదు. ఒక ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడలేదు. ఈ ఎన్నికల్లో అయితే ఎవరికీ ఫోనే చేయలేదు. ఎప్పుడో ఒకసారి 10 మంది మా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి నాకు వచ్చిన సర్వే రిపోర్టులు మీకు పంపుతున్న.. చూసుకోండి అని చెప్పిన. అంతకు మించి నేనేమీ చెప్పలేదు. ఒక పోలీసు అధికారి, డీజీపీ, సీఎస్, కనీసం ఒక జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా ఫోన్‌ చేయలేదు. నేనెక్కడ అధికారిక దుర్వినియోగం చేశాను. రూ.వేల కోట్లు మేం ఖర్చు చేసినమంటరు. చూపెడ్తరా ఎక్కడ ఖర్చు చేసినం? టీఆర్‌ఎస్‌ పార్టీని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాటలంటరా? రూ.వేల కోట్లకు తెలంగాణ ప్రజలు అమ్ముడుపోయిన్రని చెప్పడం మీ ఉద్దేశమా? ఇది ప్రజలను అవమానించడం కాదా? మీరు గెలిచిన మున్సిపాలిటీలను అదే పద్ధతిలో గెలిచిన్రా? దానికి ఏం సమాధానం చెప్తరు? ప్రజలు మిమ్మల్ని తిరేగేసి తొక్కి పడేస్తున్నరు. అయినా మేము అదే పద్ధతిలో మాట్లాడుతం అంటే మేం చేసేది ఏంలేదు. వారి ఖర్మ. ప్రజలు అమ్ముడుపోయిన్రు అంటే వారు మళ్లీ మిమ్మల్ని శిక్షిస్తరు’అని విపక్షాలను కేసీఆర్‌ మందలించారు. 

రాక్షసుల్లా పనిచేస్తాం.. 
‘ఎన్నికలంటే మాకు తెలంగాణ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం. ఇతర పార్టీలకు రాజకీయ ఆట. మాకు ఇది స్పష్టమైన కార్యం. దీనిని మేము ఆటలాగా తీసుకోం. కార్యం లాగా తీసుకుంటం. కార్యం ఎత్తుకున్నమంటే రాక్షసుల్లాగా పనిచేస్తం. ఇదే తెలంగాణ భవన్‌ నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంగ్, పార్టీ సాధారణ కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జీలైన 9 మంది, క్షేత్ర స్థాయిలో పనిచేసిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అందరూ పనిచేసినరు కాబట్టి ఈ ఫలితం వచ్చింది.’అని స్పస్టం చేశారు.  

ప్రతిపక్షాల నోటికి మొక్కాలె 
‘ప్రతిపక్షాల నోటికి మొక్కాలె. కొన్ని కుక్కలైతే నిరంతరంగా మొరిగే కుక్కలు. అవి ఈ ఎన్నికల్లో కూడా బహుళంగానే మొరిగినయి. ఏ మాట్లాడతరో ఏందో. అర్థం తాత్పర్యం ఉండదు. హద్దు అదుపు లేదు. ఒకడైతే సీఎం ముక్కు కొస్తా అంటడు. వారు జాతీయ పార్టీకి చెందిన వారు. వారి సంస్కారానికి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్టు చెంప ఛెల్లుమనిపించినట్టు దెబ్బ కొట్టిన్రు. ఇది మాములు దెబ్బకాదు. కుసంస్కారంగా, దుర్మార్గంగా, వ్యక్తిగతమైన నిందారోపణలతో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ నాయకులను దూషించడంప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని మనకు స్పష్టమవుతోంది. సోషల్‌ మీడియాలో కూడా చాలా దుర్మార్గమైన, నీచాతినీచమైన దుష్ప్రచారాలు చేశారు. అదేం సోషల్‌ మీడియానో నాకు అర్థం కాదు. అది సోషల్‌ మీడియానా? యాంటి సోషల్‌ మీడియానా? దాన్ని (కేంద్ర) ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుందో ఆలోచన చేయాలి.

దీనిని అరికట్టడానికి ఏం చేయాలో మేమూ ఆలోచన చేస్తం. ఇప్పటిదాక సహించినం కానీ, రేపటి నుంచి చాలా కఠినంగా ఉంటాం. వారు ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు బంద్‌ చేయకపోతే కొండ మీద గోపీ అయినా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ దుష్ట సంస్కృతి ప్రబలడం మంచిది కాదు. ఇప్పటికే రాజకీయాలు, నాయకత్వాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతోంది. ఇప్పటికే మనం పేపర్‌ కార్టూన్లం అయిపోయినం. ఇంకా పెద్ద కార్టూన్లు అయ్యే పరిస్థితి తెచ్చుకుందామా? రాజకీయ వ్యవస్థ అంతా ఆలోచించుకోవాలి. తిట్టడానికి ఏం ఉందండి. రేపు ఈ టైందాకా తిడుతూనే ఉండొచ్చు. అడ్దూ అదుపు, ఒక మర్యాద, సంస్కారం అనేది ఉంటది. దాన్ని బట్టి మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతం అంటే పద్ధతి కాదు. మేం చాలా సంయమనం పాటించినం’అని కేసీఆర్‌ మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇందూరు పీఠంపై వీడని ఉత్కంఠ..!

ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి

28న పవన్‌, బీజేపీ నేతల భేటీ రద్దు

వచ్చే ఏడాదికి నంబర్‌ 1 సీఎం వైఎస్‌ జగన్‌

వికేంద్రీకరణకు బీజేపీ అనుమతి అక్కర్లేదు

సినిమా

ప్రదీప్‌ సినిమా మ్యూజికల్‌ పోస్టర్‌ వచ్చేసింది..

అమ్మ సలహాలు తీసుకున్నా

బర్త్‌డే స్పెషల్‌

బాలీవుడ్‌ పద్మాలు

కార్తిక్‌తో ఆ సీన్‌లో నటించాలని ఉంది: నటి కూతురు

వరుణ్‌ తేజ్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి?