ఎక్కడ.. ఎలా?!

25 May, 2019 12:22 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయఢంకా మోగించింది. వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పసునూరు దయాకర్, మాలోతు కవిత విజయం సాధించిన విషయం విదితమే. అయితే, గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌ గత ఎన్నికలతో పోలిస్తే ‘ఎక్కడ తగ్గాం.. ఎక్కడా పెరిగాం’ అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం.

కొంత తగ్గిన మెజార్టీ 
వరంగల్‌ లోక్‌సభ పరిధిలో మొత్తం 16,66,085 ఓట్లకు గాను 10,61,672 ఓట్లు పోల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరు దయాకర్‌ 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 14,24,385 ఓట్లకు గాను 9,83,708 ఓట్లు పోల్‌ కాగా 1,46,663 ఓట్ల మెజార్టీతో మాలోతు కవిత విజయం సాధించారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా... 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సమీక్ష జరిపిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లు, మెజార్టీపై ఆరా తీసినట్లు తెలిసింది.

నాలుగు చోట్ల పైకి.. ఎనిమిది చోట్ల కిందకు...
వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. ఈసారి పరకాల, వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు పెరిగాయి. ఇక వరంగల్‌ పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం తగ్గాయి. పరకాలలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డికి 59,384 ఓట్లు వస్తే.. ఈసారి ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 87,567 ఓట్లు నమోదయ్యాయి. భూపాలపల్లిలో గతంలో టీఆర్‌ఎస్‌కు 53,567 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 91,628 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో అనూహ్యంగా మెజార్టీ పెరిగింది.

ములుగులో 2018 ఎన్నికల్లో 66,300 ఓట్లు రాగా, ఈసారి 71,518 పార్లమెంట్‌ అభ్యర్థికి వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 98,612 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 94,327 ఓట్లు పోలయ్యాయి. పాలకుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 1,17,694 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 92,437, జనగామలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 91,592 ఓట్లు రాగా.. ఇప్పుడు 68,380, డోర్నకల్‌లో అసెంబ్లీ పోలింగ్‌లో 85,467, లోక్‌సభకు 78,986, మహబూబాబాద్‌లో అసెంబ్లీకి 85,397, లోక్‌సభకు 84,031, వరంగల్‌ పశ్చిమలో అసెంబ్లీకి 81,006, లోక్‌సభలో 62,669, వర్దన్నపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,252 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 97,526 ఓట్లు నమోదయ్యాయి. అయితే, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పోలిస్తే 12 శాతం పోలింగ్‌ తక్కువ నమోదు కావడమే మెజార్టీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కానీ మరింత సమన్వయంతో పని చేస్తే ఆ ఎనిమిది సెగ్మెంట్లలోనూ వెనుకబడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న అంచనాకు అధినేత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

‘ఓరుగల్లు’పై గులాబీ జెండా.
ఒకప్పుడు కాంగ్రెస్‌.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్‌పై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ.. ఆ తర్వాత 2009 పునర్విభజనలో ఏర్పడిన వరంగల్‌గా ఏర్పడిన పార్లమెంట్‌ నియోజకవర్గానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ ఐదు, టీఆర్‌ఎస్‌ మూడు, టీపీఎస్, పీడీఎఫ్‌ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ధరావత్‌ రవీంద్రనాయక్‌ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఈ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ విజయం సాధించగా.. తాజా ఎన్నికల్లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు.

ఇక ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటల్లా ఉన్న మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దు కాగా.. 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ విజయం సాధించారు. ఇక 2014లో మహబూబాబాద్‌(ఎస్టీ)లో టీఆర్‌ఎస్‌ పక్షాన ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవిత ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం కోల్పోయినట్లయింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు