సమ్మె పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు: శ్రీధర్‌రెడ్డి

14 Nov, 2019 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, న్యాయస్థానాలను సైతం అది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన పార్టీ నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ నగర పాలకసంస్థ అవినీతికి మారుపేరుగా తయారైందని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీలో అన్ని విభాగాల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా, డల్లాస్‌గా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం గుప్పిస్తున్న వాగ్దానాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయన్నారు. నగరంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ ఘోరంగా తయారైందని విమర్శించారు. ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలు నిండిపోయి, దుర్వాసన వస్తోందని, అసలు జీహెచ్‌ఎంసీ పనిచేస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్రమ కట్టడాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు