తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ యంత్రాంగం 

5 Jan, 2020 02:49 IST|Sakshi
విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పార్టీ ముఖ్యనేతలు

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ సమావేశంతో తెలంగాణ భవన్‌ పరిసరాలు సందడిగా మారాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు 220 మందికిపైగా కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సాయన్న, లక్ష్మారెడ్డి, చెన్నమనేని రమేశ్‌ వివిధ కారణాలతో ఈ భేటీకి హాజరుకాలేదు. శనివారం మధ్యాహ్నం 12.30కు తెలంగాణ భవన్‌కు చేరుకున్న పార్టీ అధినేత... సుమారు గంటన్నరపాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ మినహా ఇతర నేతలెవరూ ప్రసంగించలేదు. 

ఉమ్మడి జిల్లాలవారీగా భేటీలు... 
ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జీలు, జడ్పీ చైర్మన్లు వేర్వేరుగా భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచార షెడ్యూల్, సమన్వయం తదితరాలపై చర్చించారు. ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల నేతలు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీ లో ఉండే అభ్యర్థులెవరైనా పార్టీ జెండాలు, పార్టీ నేతల ఫొటోలను ఉపయోగిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు.  

25న తెలంగాణ భవన్‌కు ఎమ్మెల్సీలు... 
ఈ నెల 25న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని టీఆర్‌ఎస్‌ ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉన్నందున, కో–ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక తదితరాలకు సంబంధించి పార్టీ అధిష్టానానికి సహకరించేందుకు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యత లేనందున అవసరమైన చోట ప్రచారానికి వెళ్లాల్సిందిగా సూచించారు. 

మల్లారెడ్డితో గొడవపై ఆరా తీసిన కేసీఆర్‌ 
మంత్రి మల్లారెడ్డితో శుక్రవారం చోటుచేసుకున్న గొడ వకు దారితీసిన పరిస్థితులపై మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్‌ను కలసిన సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తన వర్గం నాయకులను దూరం పెడుతూ మల్లారెడ్డి ఇష్టానుసారంగా టికెట్ల కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించడంతోపాటు జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో పెరిగిపోతున్న భూకబ్జాల పర్వంపైనా సుధీర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా, సమావేశం పూర్తయ్యాక తన విద్యాసంస్థల ఆవరణలో నిర్వ హిస్తున్న పూజా కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ను మంత్రి మల్లారెడ్డి ఆహ్వానించగా తన తరఫున పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావును పంపినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు