మాటల మాంత్రికుడు

17 Feb, 2021 08:23 IST|Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : చూస్తే బక్క పలుచగుంటడు కానీ.., తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో అన్న నినాదంతో ఉద్యమాన్ని ఉప్పెనలా మార్చిన ధీరుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే ఓ మాటల మాంత్రికుడు‌. ప్రజల సమస్యలను నిశితంగా అర్థం చేసుకుని మళ్లీ వాటిని వారికే సులువైన మాటల్లో వినిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమకారుడు.

తన వాక్చాతుర్యంతో ప్రత్యుర్థులకు ముచ్చెమటలు పట్టించే రాజకీయ నాయకుడు. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడు. ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్ద ఆలోచన చేయాలనే చెప్పే వ్యూహకర్త. పార్టీ పెట్టి.. ఉద్యమం చేసి, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రి అయిన లీడర్‌. ముందస్తు ఎన్నికలకెళ్లి ఒంటి చేత్తో రెండోసారి భారీ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వీరుడు.

ఓటమితో మొదలై... ఓటమి ఎరుగని నేతగా
ఐఏఎస్‌ కావాలని కల కన్న కేసీఆర్‌కు.. ఇంటర్‌ చదివేప్పుడే పెళ్లి కావడం, ఇతర వ్యాపకాలతో అది కలగానే మిగిలింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజిలో ఆయన హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బిఏ పూర్తి చదివారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్‌ శిష్యుడిగా ఉంటూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. డిగ్రీ పూర్తి కాగానే అసలు రాజకీయాలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలోనే జరుగుతున్నాయని భావించిన కేసీఆర్ ఎమర్జెన్సీ విధించిన ఏడాదే ఢిల్లీకి వెళ్లి సంజయ్ గాంధీ నాయకత్వంలోని యూత్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్ గాంధీ ప్రమాదంలో చనిపోవడంతో 1980లో సిద్ధిపేటకు తిరిగి వచ్చారు. ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ ఆ పార్టీలో చేరారు.

సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తన రాజకీయ తొలి గురువు మదన్ మోహన్ మీదే పోటీ చేసి కేవలం 877 వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో మళ్ళీ టీడీపీ తరఫున బరిలోకి దిగి తన రాజకీయ జీవితంలో తొలి కీలక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా ఎనిమిదిసార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1987లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1997లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1999-2001 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు.

2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 14వ లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్‌సభ సభ్యులున్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 2004 నుంచి 2006 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడమే కాకుండా యూపీఏ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు.

2008లో మళ్లీ రాష్ట్రమంతటా టీఆర్ఎస్ సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి 15,000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. సాధారణ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

రాష్ట్రమంతటా పోటీ
దేశంలో అనేక మంది నాయకులను, వారి రాజకీయ జీవితాలను పరిశీలిస్తే వారి వారి నియోజకవర్గాలు, జిల్లాలకే పరిమితమై అక్కడినుంచే అనేకమార్లు గెలిచేవారు ఎక్కువ. కానీ కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రత్యేకం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి ఘన విజయాలు సాధించిన చరిత్ర ఆయనకే సొంతం. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా తెలంగాణవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి సునాయాసంగా గెలిచిన చరిత్ర ఆయనది. సిద్దిపేట మొదలు కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, గజ్వేల్‌ల నుంచి ఆయన విజయదుందుభి మోగించారు.

పదవుల్లోనూ ప్రత్యేకతలు
పదవుల్లో పని చేయడంలో కూడా కేసీఆర్‌ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఎన్టీఆర్ మంత్రివర్గంలో డ్రాట్ అండ్ రిలీఫ్, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు .ఉమ్మడి రాష్ట్రంలో ఉప సభాపతిగా పనిచేశారు. కేంద్రంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో  కార్మిక శాఖ  విధులు నిర్వహించారు. 

తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ జూన్‌ 2, 2014న ప్రమాణం చేశారు. ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అనే నినాదంతో పరిపాలన కొనసాగించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆసరా, రైతుబంధు, కల్యాణ లక్ష్మీ లాంటి వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రెండోసారి సీఎం పదవిని చేపట్టారు.

ముందస్తుకెళ్లి.. చరిత్ర సృష్టించాడు
దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్వీకారం చుట్టిన కేసీఆర్‌... సెపెట్టంబర్‌ 6, 2018న అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపారు. ఒక్కడే రాష్ట్రమంతా తిరిగి ఒంటిచేత్తో విజయాన్ని సాధించాడు. ప్రజా కూటమి పేరిట కాంగ్రెస్‌, టీడీపీలు ముకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా నిలిచి తనపై విష ప్రచారానికి దిగినా.. మొక్కవోని దీక్షతో టీఆర్‌ఎస్‌ని అధికార పథంలో నిలిపారు. 119 స్థానాలకు పోటీ చేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఇందిరాగాంధీ లాంటి హేమాహేమీలు పరాభావం చెందినా కేసీఆర్‌ మాత్రం భారీ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అయితే నియంతృత్వ పోకడ, బంధుప్రీతి వంటి అంశాల్లో ఆయనపై  విమర్శలున్నాయి.

ఇష్టాయిష్టాలు 
కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేసేవారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం. పుస్తక ప్రియుడు. ఓల్గా నుంచి గంగ వరకు పుస్తకాలన్ని ఎన్నిసార్లు చదివారో ఆయనకే గుర్తు లేదు.దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్‌ చేయడం ఆయనకో సరదా. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. నిత్వం అన్ని పేపర్లు చదవనిదే తర్వాత పనిలోకి వెళ్లరు.గల్లీ రాజకీయం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆసక్తిగా తెలుకుంటారు.

కుటుంబం వివరాలు
కుటుంబంలోని 11 మందిలో ఒకరు. ఒక అన్నా, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. 1954 ఫిబ్రవరి ,17న చింతమడక (సిద్దిపేట)లో జన్మించిన కేసీఆర్‌కు ఒక కుమారుడు, ఒక కూతురు. ఇద్దరూ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కూతురు కవిత నిజామాబాద్‌ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కుమారుడు కేటీఆర్ మంత్రిగా, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. కుమార్తె కవిత పుట్టిన తర్వాతే రాజకీయాల్లో కలిసొచ్చిందని కేసీఆర్‌ గట్టి నమ్మకం. కొడుకు (కేటీఆర్) తొట్టిలప్పుడు (1975లో) ఇంటికి కూడా వెళ్లలేదు. కుంటుంబ సభ్యులతో తక్కువగా గడుపుతారు. 'గొప్పవాళ్లందరూ కుటుంబానికి ద్రోహులే ' అని ఆయన సమర్థించుకుంటారు కూడా.
- అంజి శెట్టె

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు