రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణస్వీకారం!

12 Dec, 2018 12:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే కేసీఆర్‌ యోచిస్తున్నట్టు సమాచారం. రాజ్‌భవన్‌లో రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని, ఆయనతోపాటు ఒక మంత్రి కూడా ప్రమాణం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్‌.. ప్రమాణస్వీకారంతోనే ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. జాతీయ పార్టీలకు చెందిన సన్నిహిత నేతలు వారి పనుల్లో బిజీగా ఉండటంతో  ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఈ విషయాలపై గులాబీ బాస్‌ కూలంకషంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసి... అనంతరం మరో భారీ వేదికపై కాంగ్రెస్‌, బీజేపీయేతర శక్తులను కూడగట్టాలనే నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

గురువారం రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, ఈమేరకు గవర్నర్‌ కార్యాలయానికి అనధికార సమాచారం అందిందని తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్ఎ‌ల్పీ సమావేశంలో టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్‌, పలువురు సీనియర్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. కేసీఆర్‌తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు