గులాబీ సారొస్తున్నారు..

3 Apr, 2019 13:51 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు అధినేత పర్యటన ఖరారు కాకపోవడంతో అసలు ఉమ్మడి జిల్లాకు వస్తారా.. లేదా అన్న సంశయం వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ఆయన పర్యటనకు సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యవరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలను సీఎం కేసీఆర్‌ మంత్రి ఐకేరెడ్డి భుజాల మీద ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తున్న ఐకేరెడ్డి మంగళవారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని సీఎం టూర్‌కు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈనెల 7న సాయంత్రం 4 గంటలకు నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో గులాబీ కేడర్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

భారీ జన సమీకరణ..
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, ముథోల్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాలు ఉండగా, నిర్మల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను ఎంచుకోవడం గమనార్హం. ప్రధానంగా నిర్మల్‌ నియోజకవర్గం చుట్టూ ముథోల్, ఖానాపూర్, బోథ్‌ ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ సొంత నియోజకవర్గం ఖానాపూర్‌ కావడం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు సొంత నియోజకవర్గం బోథ్‌ కావడంతో ఇక్కడ సభ నిర్వహించడం ద్వారా ఈ రెండు నియోజకవర్గాలతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని వ్యూహం రచించారు. ప్రధానంగా నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు సభకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, ముథోల్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందారు. అయితే ఆయన కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి నడవడంతో ఈ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలన్నింటిలో టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడుతోంది. దీంతో లోక్‌సభ ఎన్నికలు గులాబీ పార్టీకి ఎమ్మెల్యేలతోపాటు ఇటు కేడర్‌ బలం ఉండడంతో విజయంపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ కంటే ఈ ఎన్నికల్లో 4లక్షల మెజార్టీ సాధించాలని ప్రతీ సభలో మంత్రి ఐకేరెడ్డి పేర్కొంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లోనైతే మెజార్టీ తగ్గిందో అక్కడ ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు భారీ మెజార్టీ సాధించాలని మంత్రి ఐకేరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ జిల్లాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాథోడ్‌ బాపూరావు, కోనేరు కోనప్ప, అజ్మీర రేఖానాయక్, ఆత్రం సక్కు కూడా ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ సాధన కోసం విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

కాంగ్రెస్‌ అధినేతలేరి?
కాంగ్రెస్‌ పార్టీ అధినేతలెవరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. సోమవారం రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌ గాంధీ జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే జిల్లా పర్యటనపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ పర్యటన అనుమానంగానే కనిపిస్తోంది. ఇక ఆ పార్టీ రాష్ట్ర నేతలు కూడా జిల్లాలో ఎన్నికల పర్యటన జరపలేదు. రాష్ట్ర నేతలు కూడా ఈ ఎన్నికల్లో బరిలో నిలవడంతో ఇటు వైపు దృష్టి సారించడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా సీఎం కేసీఆర్‌ సభ ఉమ్మడి జిల్లాలో ఖరారు కావడంతో చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అధినేతలు ఎవరైనా జిల్లాకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

బీజేపీది అదే పరిస్థితి..
బీజేపీలో అధినేతల పర్యటనపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రిగా ఆయన దేశ వ్యాప్తంగా పర్యటిస్తుండడంతో మళ్లీ ప్రచార గడువులోగా ఇటువైపు వస్తారా? లేదా అనేది అనుమానమే. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన ఉంటుందా.. లేదా అనేది తెలియదు. రాష్ట్ర నేతలు కూడా వస్తారా? లేదా అన్నది పార్టీలో ఇంకా తేల్చలేని పరిస్థితి ఉంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో జోరు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో జాతీయ నేతలతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయా పార్టీల రాష్ట్ర ముఖ్య నేతలు, సీనిగ్లామర్‌తో ఆ ఎన్నికల్లో ప్రచార కళ కనిపించింది. అక్టోబర్‌లో రాహుల్‌ గాంధీ భైంసాలో పర్యటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నవంబర్‌ 28న ఆదిలాబాద్‌ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాలలో ఒకే రోజు సుడిగాలి పర్యటన జరిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క, విజయశాంతి, ఖుష్బు, అప్పటి కాంగ్రెస్‌ నేత డీకే అరుణ, బీజేపీ నుంచి లక్ష్మణ్‌ పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు.. ఆదిలాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్, కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు పోటీచేస్తున్నారు. ఆయా నియోజకవర్గ నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. 

మరిన్ని వార్తలు